అవిశ్వాసమా.. రాజీనామా..?

by Disha Web Desk 15 |
అవిశ్వాసమా.. రాజీనామా..?
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. దానికోసం మున్సిపాలిటీలో నలుగురు ఉన్న తమ బలాన్ని 27 కు పెంచుకుంది. 27 మంది కౌన్సిలర్లతో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు

కలెక్టర్ కు కౌన్సిలర్లు తీర్మానం అందజేయగా ఈ నెల 30న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు. ఇప్పటికే 27 మంది కౌన్సిలర్లతో పాటు తమకు మద్దతుగా నిలిచే మరో ఏడుగురు కౌన్సిలర్లను గోవా క్యాంపుకు తరలించింది. ఈనెల 30న క్యాంపునకు వెళ్లిన కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. దాంతో కామారెడ్డి మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

కౌన్సిలర్లకు విప్ జారీ అవకాశం ఉందా..?

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో 38 గా ఉన్న బీఆర్ఎస్ బలం ప్రస్తుతం 16 కు చేరినట్టుగా తెలుస్తోంది. మిగతా వారిలో ఆరుగురు బీజేపీ, 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కౌన్సిలర్లలో విడతల వారీగా 8 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా ప్రస్తుతం ఘర్ వాపసిలో భాగంగా వెనక్కి వచ్చారు. వారితో పాటు మరికొంత మందిని తీసుకురావడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారింది.

గత ఏడాదిన్నర కాలంగా మున్సిపల్ బీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గ్రూపులుగా మారిపోయి చైర్మన్ కు వ్యతిరేకంగా మారినట్టుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఏకంగా చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే వరకు వెళ్లింది. ఈ తరుణంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మధ్య వైరం విప్ జారీకి అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేతో సఖ్యత ఉండి ఉంటే ప్రస్తుతం పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశం ఉండేదని, స్వయంగా తనకు తానుగానే ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

గోవా క్యాంపులో కౌన్సిలర్లు

చైర్మన్ పై అవిశ్వాసం లేఖ కలెక్టర్ కు అందజేసిన రోజే 27 మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో క్యాంపుకు తరలివెళ్లారు. కొద్దిరోజుల పాటు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఉన్న కౌన్సిలర్లు తాజాగా చైర్మన్ కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో వారితో పాటు 27 మంది కౌన్సిలర్లంతా గోవా టూర్ కు బయలుదేరారు. 30న అవిశ్వాసం రోజునే వారు తిరిగి కామారెడ్డికి రానున్నారు.

రంగంలోకి కేటీఆర్

అవిశ్వాసానికి గడువు సమీపిస్తుండటంతో మున్సిపాలిటీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగినట్టుగా ప్రచారం సాగుతొంది. చైర్మన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైన బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కేటీఆర్ మాట్లాడారని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆలోచనలో పడ్డ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస మద్దతుపై పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయోమయంలో చైర్మన్ కుటుంబం

మరోవైపు ఇంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగి చైర్మన్ కు మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లు ఒక్కసారిగా చేజారిపోవడంతో చైర్మన్ కుటుంబం అయోమయంలో పడింది. తమకు నమ్మిన వ్యక్తులుగా ఉన్నవాళ్లు సైతం దొడ్డిదారిన కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో అవిశ్వాసం గండం నుంచి బయటపడే మార్గాలను చైర్మన్ అన్వేశిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగినా చైర్మన్ నిట్టు జాహ్నవి మినహా

ఆయన తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు, బాబాయ్ నిట్టు కృష్ణమోహన్ రావు డుమ్మా కొట్టారు. దాంతో నిట్టు కుటుంబం పార్టీ మారడం పక్కా అనే ప్రచారం సాగింది. పార్టీ మారడం కన్నా రాజీనామా చేయడమే శ్రేయస్కరమని నిట్టు కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ మంత్రంగం పని చేయకపోతే రేపో మాపో రాజీనామా చేసి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం సాగుతోంది. రాజీనామా చేస్తే హుందాగా పదవి నుంచి తప్పుకున్నట్టుగా ఉంటుందని, అలాగే అవిశ్వాసం నెగ్గడం ద్వారా పదవి పోయిందన్న అపవాదు కూడా ఉండదన్న ఆలోచనలో నిట్టు కుటుంబం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో 30న జరగబోయే అవిశ్వాసం నెగ్గుతుందా వీగిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed