జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

by Prasanna |   ( Updated:2024-09-26 03:22:09.0  )
జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో జ్వరాలతో బాధపడుతున్న పేషంట్లు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ద్య సమస్య అధికంగా ఉండటంతో ఎక్కువగా ప్రజలు జ్వరాల బారిన పడటం సాధారణంగా జరిగేది. కానీ, ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రాంతాల్లోనూ జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మలేరియా, డెంగీ కేసులు వందల సంఖ్యలో నమోదవుతుండటంతో డాక్టర్లే ఆశ్యర్యపోయే పరిస్థితులేర్పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో డెంగీ తో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ, అధికారులు మాత్రం డెంగీ మరణాలేవీ నమోదు కాలేదని చెపుతుండటం గమనార్హం. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లన్నీ రోగులతో నిండిపోతున్నాయని డాక్టర్లు చెపుతున్నారు. గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్న భీమ్ గల్, సిరికొండ, డిచ్ పల్లి, ధర్ పల్లి తదితర మండలాల పరిధిలోని గిరిజన తండాల్లో కూడా జ్వర పీడితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని గిరిజనులు అంటున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు ఖర్చులు చేసుకున్నామని, ఇంట్లో ఒక్కరికి జ్వరం వస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులందరినీ వదలడంలేదని ఫీవర్ బాధితులంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్ జ్వరం బారినపడటంతో ఇంట్లోని కుటుంబ సభ్యులంతా జ్వరాల బారిన పడి అవస్థలు పడ్డారు. సుమారు నెల రోజుల వరకు డ్యూటీకి వెళ్లేంత ఓపిక లేక ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, కామారెడ్డి జిల్లాలో డెంగీతో నలుగురు చనిపోయినట్లు తెలుస్తున్నప్పటికీ అధికారులు ధృవీకరించడం లేదు.

కష్టార్జితమంతా ట్రీట్మెంట్ కోసం ఖర్చు

గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేసుకుని సంపాదించిన సొమ్మంతా డెంగీ ట్రీట్మెంట్ కే ఖర్చవుతోందని, బయట అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తోందని కొందరు బాధితులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలానికి చెందిన ఓ బాధితుడు తన కొడుకు డెంగీ బారిన పడటంతో నిజామాబాద్ లో ట్రీట్మెంట్ సరిగా అందకపోతే హైదరాబాద్ కు తీసుకెళ్లారు. దాదాపు15 రోజుల తర్వాత కోలుకున్న రోగికి దాదాపు రూ.1.50 ఖర్చయినట్లు చెప్పాడు. తెలిసిన వారి దగ్గర రూ.2 ల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకుని కొడుకును కాపాడుకున్నానని ఓ తండ్రి అన్నారు. ఇలా చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేస్తూ ప్రాణాలు దక్కించుకోడానికి వేలకు వేలు చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు బాగా ఉన్నాయని, నైపుణ్యం గల డాక్టర్లు నాణ్యమైన చికిత్సను అందిస్తారని చెపుతున్నప్పటికీ, జీజీహెచ్ లో అడ్మిట్ అయిన పేషంట్లను వార్డులో ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలున్నాయి. అక్కడే చికిత్స చేయిస్తే ప్రాణాలుంటాయో పోతాయోననే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు షిఫ్ట్ అవుతున్నట్లు రోగులు చెపుతున్నారు.కొంత మంది జీజీహెచ్ లో వైద్య సిబ్బందే రోగులను భయపెట్టి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

44వేల మంది జ్వర పీడితులు

నగరంలోని జీజీహెచ్ లో సెప్టెంబర్ నెలలో ఒక్క జీజీహెచ్ లోనే ఇప్పటి వరకు దాదాపు 44 వేల మంది ఔట్ పేషంట్లు చికిత్స కోసం వచ్చినట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదైంది. వివిధ అనారోగ్యకారణాలతో జీజీహెచ్ లో ఇన్ పేషంట్లుగా ఇప్పటి వరకు 3,075 మంది ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఔట్ పేషంట్ విభాగంలో జ్వరపీడితులు 2,565 మంది నమోదవ్వగా, ఇన్పేషంట్లుగా 623 మంది జాయిన్ అయ్యారు. ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్న వారు 64 మంది ఇన్ పేషంట్లుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. డెంగ్యూపాజిటివ్ కేసులు 82 నమోదు కాగా, ఇన్ పేషంట్ వార్డులో 15 మంది డెంగ్యూ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ప్రతినెలా వేల సంఖ్యలో 50 వేలకు పైబడి రోగులు జీజీహెచ్ కు వచ్చారు. వందల సంఖ్యలో పేషంట్లు ఇన్ పేషంట్లుగా చికిత్స పొందారు. జిల్లాలో పెరిగిపోతున్న మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణకు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.జ్వరాలు ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో వైద్య శిబిరాలేర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed