కాంగ్రెస్‌ వస్తే మాట మీద నిలబడదు

by Sridhar Babu |
కాంగ్రెస్‌ వస్తే మాట మీద నిలబడదు
X

దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వారు మాట మీద నిలబడే రకం కాదని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణను ఇచ్చి వెనక్కి తీసుకున్న ఆ పార్టీ గత చరిత్రే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్, కేసీ తాండా, కోన సముందర్‌లలో ఆయన ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ 24 గంటల్లోపే యూ టర్న్ తీసుకోవడంతో ఉద్యమ కారులు, అమరులు అవాక్కయ్యారన్నారు. ఆలోచించి ఓటు వేస్తేనే రాజకీయాలకు విలువ ఉంటుందన్నారు. పనిచేసే వారికి ఓటు వేస్తే విలువైన రాజకీయాలు ప్రజలకు అందుతాయన్నారు.

గల్ప్‌కు వెళ్లిన వారు అక్కడ పని దొరికితే ఉన్నట్టు, లేదంటే తిరిగిరావడమే లాంటి పరిస్థితులను గమనించి ఇక మీదట రేషన్‌కార్డుల్లోంచి వారి పేర్లను తొలగించే నిబంధనను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రెండు గ్రామాల్లో ప్రజలు కోరిన పలు సమస్యలను తప్పుకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన ఎంత పెద్ద పని అయినా సరే చేసిపెట్టే సత్తా ప్రశాంత్‌ రెడ్డికి ఉందన్నారు.హైదరాబాద్‌లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఇక్కడే వేల్పూర్‌లో ఉండే మంత్రి ప్రశాంత్‌రెడ్డిని వదులుకొని ఢిల్లీ పార్టీలను తెచ్చుకుంటే తీవ్రంగా నష్టపోతామన్నారు. రాష్ట్రం బాగుకోసం బలంగా నిలబడే నాయకులు వీరు అని అన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో సైనికుడిగా ఉన్న కేసీఆరే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చిన మాజీ కేంద్ర హోం మంత్రి చిదంబరం ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు పై కాంగ్రెస్‌ పార్టీ యూ టర్న్‌ తీసుకోవడం వల్ల ఎందరో విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకోవాల్సి వచ్చినందుకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story