భవానిపేట్ - పోతారం బ్రిడ్జి మూసివేయాలి

by Sridhar Babu |
భవానిపేట్ - పోతారం బ్రిడ్జి మూసివేయాలి
X

దిశ, మాచారెడ్డి : ప్రమాదకర స్థాయిలో ప్రవహించి కోతకు గురైన భవానిపేట వాగు పై గల వంతెన పై నుంచి రాకపోకలను నిలిపివేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మండలంలోని భవానిపేట్ - పోతారం గ్రామాల మధ్య గల వంతెన పై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. వంతెనకు ఆనుకొని ఉన్న బీటీ రోడ్డు వరదల కారణంగా కోతకు గురైంది. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున వంతెన పై నుంచి రాకపోకలు నిలిపివేయాలన్నారు.

అధిక వర్షాల వలన వంతెన పై నుండి ప్రమాదకరంగా నీరు పారుతోందని ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా నీటి ప్రవాహం తగ్గేవరకు ముందస్తుగా వంతెనకు ఇరువైపులా బారికేడింగ్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ జయంత్ రెడ్డిని ఆదేశించారు. అంతకుముందు జక్కుల చెరువు అలుగును పరిశీలించి చెరువు నుండి వచ్చే వాటర్ వలన కింది గ్రామానికి ఏమైనా సమస్య తలెత్తుతుందా అని అడిగి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి ఆర్డీవో రంగనాథరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో గోపి బాబు, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed