Attack : ఇసుక రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దాడి…తలకు తీవ్ర గాయాలు

by Kalyani |
Attack : ఇసుక రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దాడి…తలకు తీవ్ర గాయాలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్రమ ఇసుక రవాణాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగబడుతున్నారు. తాజాగా భీంగల్ మండలం బెజ్జోర గ్రామ శివారులోని కప్పల వాగు నుంచి కొంతకాలంగా నిరాటకంగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న మహేందర్ అనే బిఆర్ఎస్ కార్యకర్తపై భాస్కర్ అనే వ్యక్తి దాడి చేసినట్లు తెలుస్తోంది.

ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్న మహేందర్ తో భాస్కర్ అనే వ్యక్తి వాగ్వాదానికి దిగి దాడి చేయడంతో మహేందర్ కు తలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి తనపై జరిగిన దాడి విషయమై బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కార్యకర్త మహేందర్ పై దాడి జరిపిన భాస్కర్ అధికార పార్టీ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి అనుచరుడని తెలుస్తోంది. గతంలో కూడా అక్రమ రవాణాను అడ్డుకొని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం నిధుల కోసం తంటాలు పడుతుంటే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే ఖనిజ వనరుల శాఖలోనే భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీనికి అధికార పార్టీకి చెందిన నాయకులే కారణమవుతుండడం గమనార్హం.

Next Story

Most Viewed