- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బట్టాపూర్ కంకర క్వారీలో అన్ని అక్రమాలే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఓ క్వారీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2016లో ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్‌లో ప్రారంభమైన కంకర క్వారీ.. క్రషర్‌గా.. ఇప్పుడు రెడ్ మిక్స్ ప్లాంట్‌గా ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నా రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో 3.87హెక్టార్ల భూమిలో 10,000 క్యూబిక్ మీటర్ల కంకర తరలించేందుకు అనుమతి తీసుకుని 12 లక్షల క్యూబిక్ మీటర్ల కంకరను తరలించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంలో రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు అటవీ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా సంబంధిత జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి దక్కాల్సిన రూ.కోట్ల రాయల్టీ (సీనరేజీ) ఎగవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నాయకులు బట్టాపూర్ క్వారీలో అక్రమాలపై పోరుబాట పట్టారు. ఇటీవల అక్కడ ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ బాల్కొండ నియోజకవర్గ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఇటీవల బట్టాపూర్ గ్రామస్థులు దశలవారీగా ఆందోళనకు పిలుపు నిస్తుండడంతో బట్టాపూర్ క్వారీ అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్న ఆ క్వారీ కథ కమామీషు పై కథనం.
పరిధి దాటి క్రషింగ్..
ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గుట్ట సర్వే నెంబర్ 195/1ను 3.87 హెక్టార్లలో కొందరు కంకర క్వారీకి అనుమతులు తీసుకున్నారు. 2016 ఫిబ్రవరి 27 నుంచి 2026 వరకు 10 సంవత్సరాలకు కంకర తవ్వకాలకు లీజుగా తీసుకున్నారు. దానికి మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చింది. కానీ, పోల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకుండానే గుట్టను తొలిచి క్రషింగ్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు భూగర్భ గనుల శాఖ నుంచి 13,686 క్యూబిక్ మీటర్ల అనుమతిని తీసుకొని ఇప్పటి వరకు 6.36లక్షల సీనరేజీని చెల్లించినట్లు తెలిసింది. కానీ అక్కడ అనుమతి తీసుకున్న 3.87హెక్టార్ల స్థలానికి మించి మొత్తం గుట్టను తవ్వేశారు.
అక్కడ తవ్వకాలు కొండను తొలిచి కంకర కోసం కాదు. తవ్వకాలు ఏకంగా ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్టులను సైతం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కంకర క్వారీ నుంచి తవ్వకాలు చేసి తరలించేందుకు అటవీ ప్రాంతం(రిజర్వ్ ఫారెస్ట్) మీదుగా కంకర రోడ్డు వేశారు. అక్కడ తొలిసారిగా ఫిర్యాదుపై కంకర క్వారీని పరిశీలించేందుకు వచ్చిన కమ్మర్‌పల్లి ఎఫ్ఆర్ఓను 24 గంటల్లో బదిలీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లులు కట్టకుంటే అధికారులు కనెక్షన్ తీసేస్తుంటారు. కానీ, ఆ క్వారీ మీద రూ.50 లక్షల వరకు కరెంట్ బిల్లులు పెండింగ్ ఉంటే ఆరు నెలల కింద ఫిర్యాదు అందిన తర్వాత రూ.50లక్షలు బిల్లులు కట్టినట్లు తెలిసింది.
అన్ని అక్రమాలే...
బట్టాపూర్ కంకర క్వారీలో అనుమతులు తీసుకున్న పది వేల క్యూబిక్ మీటర్లకు బదులుగా, సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా కంకర తరలించినట్లు పక్కా సమాచారంతో ఆరు నెలల కింద హైదరాబాద్‌లోని గనుల శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాని మీద ఈటీఎస్ సర్వే నిర్వహించాలని అసిస్టెంట్ డైరెక్టర్ నిజామాబాద్‌కు ఆదేశాలు ఇస్తే సర్వే చేసేందుకు డబ్బు జమ చేయాలని సంబంధిత లీజు సంస్థకు అధికారులు లేఖల ద్వారా సమాచారం అందించారు. ఎక్కడ తమ అక్రమ తవ్వకాల బాగోతం బయటపడుతుందోనని ఇప్పటికీ క్వారీ లీజు తీసుకున్న యాజమాన్యం డబ్బు జమ చేయలేదని తెలుస్తోంది. సర్వే చేస్తే అసలు విషయాలు బయటపడతాయని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీసం రూ.200 కోట్లకు పైగా జరిమానా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక కంకర క్వారీలో తవ్వకాలకోసం జరిపే బ్లాస్టింగ్‌లకు అనుమతి లేనట్లు తెలుస్తోంది. బ్లాస్టింగ్ కోసం వాడే పేలుడు పదార్థాలు పోలీస్ట్ స్టేషన్‌లో నిలువ ఉంచకుండా అక్కడే నిల్వ ఉంచి ఇల్లీగల్‌గా తవ్వకాల కోసం వాటిని వినియోగిస్తున్నారు. అక్కడ కంకర క్వారీలో జరిపే పేలుళ్లతో పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం అయిన బాల్కొండ నియోజకవర్గంలో అనుమతులు లేని కంకర క్వారీ వ్యవహారంలో జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు వెనకడుగు వేస్తుండడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ జరుగుతున్న వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియకుండా అన్ని ఓత్తిళ్లేనని అధికారులు చెబుతుండడం గమనార్హం.