కష్టం చేసి.. బాకీ తేర్పుతా..?

by Sumithra |
కష్టం చేసి.. బాకీ తేర్పుతా..?
X

దిశ, భిక్కనూరు : మొత్తం దివాలా తీశాను.. నా దగ్గర అయితే డబ్బులు లేవు, మీరు ఒప్పుకుంటే ఊళ్లోకొచ్చి బతుకుతా..? కష్టం చేసి మీ బాకీలు చెల్లిస్తా రెండున్నర నెలల క్రితం పరారైన భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన పంటచిట్టీల వ్యాపారి మహేందర్ చెబుతున్న మాటలివి. బాకీదారులకు టోకరా పెట్టి ఊడయించిన పంటచిట్టి వ్యాపారిని ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ ఆధారంగా భిక్కనూరు పోలీసులు హైదరాబాదులో అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు, గ్రామస్తులు పోలీసుల సమక్షంలోనే పంటచిట్టి వ్యాపారితో బుధవారం మాట్లాడారు గ్రామంలో ఉన్న భూమి జాగలను విక్రయించగా, వచ్చిన డబ్బులను బాధితులు పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నారు.

ఇంకా తన వద్ద ఆస్తులేమి లేవని బాధిత పంట చిట్టి వ్యాపారి స్పష్టం చేశాడు. ఇంకా 70 లక్షల వరకు చిట్టీలు కట్టేవి ఉండడంతో పాటు, కొంతమంది వద్ద అప్పుగా ఇచ్చిన డబ్బులు లక్షల్లో ఉండడంతో ఏ విధంగా అప్పులు చెల్లిస్తావని బాధితులు గుర్జకుంట గ్రామస్తులు ప్రశ్నించారు. కాగా మీరు ఒప్పుకుంటే ఊళ్ళో కి వచ్చి బతుకుతా.. కాయకష్టం చేసుకుంటూ బాకీలు కడతా, నన్నెవరు ఏమీ అనొద్దంటూ చెప్పగా ఒక్కసారిగా నోరు తెరిచారు. అంత పెద్ద మొత్తంలో బాకీ పడ్డ డబ్బులు ఎన్ని రోజులకు తేర్పుతావని కొందరు ప్రశ్నించగా, మరికొందరు నీ వల్ల బాకీ చెల్లించడం సాధ్యంకాదని తేల్చి చెప్పడంతో బాధిత పంట చిట్టి వ్యాపారి తలవంచక తప్పలేదు.

సుమారు 500 మంది బాధితులు ఉండడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కేవలం చిట్టీలను బాగా నష్టానికి ఎత్తుకొని, ఆ చిట్టి డబ్బులు ఇంకో చిట్టికి కట్టి, ఇంకో చిట్టి డబ్బులను మరో చిట్టికి అడ్జస్ట్ చేసి కట్టి, రొటేషన్ చేయడం వల్ల అధిక మొత్తంలో వడ్డీలు కట్టలేక ఆర్థికంగా నష్టపోయాడని గుర్తించారు. పంట చిట్టి వ్యాపారిని పట్టుకొచ్చారన్న సమాచారం అందగానే ఎంతోకొంత డబ్బులు చేతికొస్తాయని భావించిన బాధితులకు చివరకు నిరాశే మిగిలింది.

Advertisement

Next Story