నిఖితది ముమ్మాటికి హత్యే: మందకృష్ణ మాదిగ

by Sathputhe Rajesh |
నిఖితది ముమ్మాటికి హత్యే: మందకృష్ణ మాదిగ
X

దిశ, అచ్చంపేట : జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఈనెల 6న విద్యార్థిని జరిగిన ఘటనలో నిఖితది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి హత్యే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం బాలికల గురుకుల కళాశాల ముందు మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు దళిత సంఘాలతో కలిసి కొద్దిసేపు నిరసన చేశారు. అనంతరం గురుకుల పాఠశాలలో సుమారు రెండు గంటలపాటు నిశితంగా అన్ని విషయాలను పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థిని నాగిళ్ళ నిఖిత‌పై ముందుగా దాడి జరిగిందని స్పృహ కోల్పోవడం మూలంగానే తదుపరి ఫ్యానుకు ఉరివేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ఆత్మహత్య కాదు హత్యే అన్నారు. ఆ విద్యార్థినిపై దాడి జరిగిందనడానికి ప్రధాన కారణం కణతపై గాయం ఉందని ఆ విషయం తల్లిదండ్రులు గుర్తించారని తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో పోలీసులు శరీరంపై గాయాలేం లేవని ఎలా చెప్పారని అన్నారు. అలాగే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో గుర్తులు నేటికీ కనిపిస్తున్నాయని వివరించారు.

విద్యార్థి మృతిపై సంబంధిత ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. అలాగే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని సూటిగా ప్రశ్నించారు. అర్ధరాత్రి ఆగ మేఘాలపై పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏమున్నదని, పోస్టుమార్టం కూడా పాక్షికంగానే చేశారని చెప్పేందుకు విద్యార్థి కణతపై గాయం గుర్తించకపోవడం నిదర్శనమన్నారు. నిందితులతో స్థానిక డాక్టర్ కుమ్మక్కై తప్పుల మీద తప్పులు చేసినట్టుగా స్పష్టమవుతుందన్నారు.

ఉస్మానియా గాంధీ వైద్యులచే..

నిఖిత ఆత్మహత్య కాదు హత్యేనని, 48 గంటలలో ఉస్మానియా గాంధీ ప్రత్యేక వైద్య నిపుణుల చేత శాస్త్రీయ బద్ధంగా రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థి మృతికి సంబంధించి స్పష్టమైన అనుమానాలు వ్యక్తమవుతున్న, ఆధారాలు కనిపిస్తున్న నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు దళిత ప్రజాప్రతినిధులైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు న్యాయ విచారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్‌సి‌ఓ వనజపై..

విద్యార్థి మృతితో అటు కుటుంబ సభ్యులు దళిత సంఘాల నాయకులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన సందర్భంగా ఆరోజు ఆర్‌సీఓ వనిజ శివాలయం వద్ద రాజకీయాలు చేస్తారా అని మా దళిత సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. ఆర్‌సి‌ఓ వనజపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే క్లాస్ టీచర్ గీతారాణిపై కూడా తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని మరియు అందుకు సంబంధించిన కారకులపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే...

ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల విద్యార్థులు ఎక్కడ ఆత్మహత్యలు జరిగిన అవి అనుమానాస్పద హత్యలు అని కంటి తుడుపు చర్యగా కేసులు నమోదు చేస్తున్నారని మండి పడ్డారు. ముమ్మాటికి ఆత్మహత్యలు కాదు హత్యలు అని ఆయన తెలిపారు. సిట్టింగ్ జడ్జి చేత న్యాయవిచారణ, రీ పోస్టుమార్టం, బాధ్యులందరిపై కేసు నమోదు చెయ్యకపోతే విడతల వారీగా పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగా మంగళవారం ఉమ్మడి అమ్రాబాద్ మండలానికి బంధు పిలుపునిస్తున్నామన్నారు.

15న 7 మండలాలలో బంధు చేపడతామని, 16న అచ్చంపేట పట్టణంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ బందు ప్రదర్శన ఉంటుందని ఈ ప్రదర్శనలో స్వయంగా తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షలు ఉన్నందున ఆ విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా నిరసన కార్యక్రమాలు చేపడుతామని తదుపరి ఉమ్మడి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కార్యచరణ ఆరోజు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు కాశీం, మహేష్, నాసరయ్య, టిడిపి ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య, పాతకుల శ్రీశైలం, కుంద మల్లికార్జున్, కాసన్న యాదవ్, ఆలేటి శ్రీశైలం, జంగయ్య, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed