ఇందిరమ్మ ఇండ్లకు సెంట్రల్ ఫండ్స్!.. తెలంగాణ సర్కార్ కసరత్తు!

by karthikeya |   ( Updated:2024-09-15 02:17:33.0  )
ఇందిరమ్మ ఇండ్లకు సెంట్రల్ ఫండ్స్!.. తెలంగాణ సర్కార్ కసరత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో:ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నుంచి సహాయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణ హౌసింగ్ శాఖ నిబంధనలను సిద్ధం చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. దీంతో ఆ తప్పిదం పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇండ్ల నిర్మాణాలకు నిధులు వచ్చే విధంగా మార్గదర్శకాలు తయారు చేస్తున్నది.

నాటి తప్పులు జరగకుండా చర్యలు

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన’ పథకాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గత సర్కారు డబుల్‌ బెడ్‌రూమ్ పథకానికి ఈ నిధులు వినియోగించుకోకపోవడంతో అది భారంగా మారింది. కేంద్ర నుంచి నిధులు రాకపోవడంతో గత ప్రభుత్వం హయాంలో దాదాపు రూ. 359.56 కోట్లు నష్టపోయినట్లు నిర్ధారించారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా డబుల్ బెడ్ రూమ్ పథకం లేకపోవడంతో నిధులు ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2022లో రూ.190.79 కోట్లు, రూ.168.77 కోట్లు ఇవ్వకుండా ఆపేసింది. ఈ సారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అలాంటి ఇబ్బందులు రావద్దని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. అందుకే పీఎంఏవై రూల్స్‌కు లోబడి నిబంధనలను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్ వద్దకు ప్రాథమికంగా తెలంగాణ హౌసింగ్‌ శాఖ రూపొందించిన నిబంధనలను పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ‘ఇందిరమ్మ’ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక రూపకల్పన ఉంటుందని వివరిస్తున్నారు. తెలంగాణ హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రూపొందించే సాంకేతిక వేదిక ఆధారంగా స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన చేయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. పీఎంఏవై నిబంధనలకు లోబడి చేస్తే ప్రతీ లబ్ధిదారుడికి కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి సుమారు రూ.2 లక్షల వరకూ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా రూ.3 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు తెలిసింది.

పీఎంఏవై నిధులు కోసం ఏం చేయాలి

ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన(పీఎంఏవై) నిధులు రావాలంటే ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్‌ శాఖలో స్కీంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను ముందుగా ఎంపిక చేసి, కేంద్ర గృహ నిర్మాణ శాఖకు జాబితాను అందజేయాలి. 2011లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. దాని ఆధారంగా రూపొందించిన జాబితాకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దాంతోపాటు ఈ సారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని తెలంగాణ హౌసింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా చేయని పక్షంలో పీఎంఏవై నిధులను కేంద్రం ఇవ్వదని చెబుతున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed