గ్రూప్- 1 అభ్యర్థుల్లో కొత్త టెన్షన్.. పరీక్ష రద్దు చేస్తే పరిస్థితి ఏంటి..?

by Satheesh |   ( Updated:2023-03-15 00:30:01.0  )
గ్రూప్- 1 అభ్యర్థుల్లో కొత్త టెన్షన్.. పరీక్ష రద్దు చేస్తే పరిస్థితి ఏంటి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్ లీకేజీ అంశం సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రం సైతం లీక్ అయ్యిందంటూ వస్తున్న ఆరోపణలతో పరీక్ష రాసి క్వాలిఫై అయిన అభ్యర్థుల్లో అలజడి మొదలైంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయి జూన్ లో జరిగే మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను ఈ అంశం కుదిపేస్తోంది. ఎన్నో కష్టనష్టాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఇక్కడి వరకు చేరుకుంటే పేపర్ లీకేజీ అంటూ తెలియడంతో ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తే ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ ఎగ్జామ్ కు ప్రిపేరవుతున్న వారి భవితవ్యం ఏంటనేది ఇప్పుడు అయోమయంలో పడింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మొత్తం 2.86 లక్షల మంది రాశారు. గతేడాది అక్టోబర్ 16వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ ఏడాది జనవరి 13న ఫలితాలు ప్రకటించారు. జూన్ 1వ తేదీన మెయిన్స్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు స్పష్టంచేశారు. కాగా 2.86 లక్షల మంది పరీక్ష రాస్తే అందులో 25,500 మంది క్వాలిఫై అయ్యారు. 1:50 రేషియో పద్ధతిన క్వాలిఫై ప్రక్రియను చేపట్టారు.

తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్న పత్రం లేకేజీ జరిగిందంటూ వస్తున్న వార్తలతో 25,500 మంది జీవితాలు డైలమాలో పడ్డాయి. వారంతా జూన్ లో జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎన్నో వ్యయప్రయాసలనోర్చి ప్రిపేరవుతున్నారు. ఈ తరుణంలో లీకేజీ అంశం వారిని ఒక్కసారిగా కుదిపేసింది. ఇప్పటికే అటు కోచింగ్ సెంటర్లకు, ఇటు హాస్టల్ ఫీజులకు, రవాణా చార్జీలను చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతన్న వారి నెత్తిపై లీకేజీ అంశంతో పిడుగు పడినట్లయింది.

ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని తట్టుకుని పరీక్షకు సన్నద్ధమవుతుంటే మెయిన్స్‌కు ప్రిపేరయ్యేదెలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వేయక వేయక గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేస్ఏతే ఇలా జరగడంపై అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. నిజంగానే లీకేజీ జరిగినట్లు నిర్ధారణ అయితే పరిస్థితి ఏంటి? అనే డైలమాలో అభ్యర్థులున్నారు.

ఒకవేళ పరీక్షను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ వేస్తే కాంపిటేషన్ పెరిగే అవకాశముంది. కాగా ఇప్పటికే వయోపరిమితి కారణంగా పలువురు ఈ పరీక్షకు దూరమైన విషయం తెలిసిందే. పెంచాలని డిమాండ్ చేసినా దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ వస్తే ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారా? లేదా అనే భయం సైతం మెయిన్స్ రాసే అభ్యర్థుల్లో నెలకొంది. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి? ఇంత కాంపిటీషన్ లో మళ్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరీక్ష రద్దు అంశంపై ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాక రాక వచ్చిన నోటిఫికేషన్ కావడంతో గర్భిణులు సైతం ఇబ్బంది ఎదుర్కొని పరీక్ష రాసి క్వాలిఫై అయ్యారని, పరీక్ష రద్దు చేస్తే క్వాలిపై అయిన వారికి అన్యాయం జరిగినట్లేనని పలువురు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కాగా ఇంకొందరు మళ్లీ రాసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు చెబుతుండటం గమనార్హం. ప్రశ్న పత్రాలు లీక్ చేసిన నిందితుడు ప్రవీణ్ కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 150 కి 103 మార్కులు రావడంపై పలు అనుమానాలున్నట్లు వారు వెల్లడించారు.

అతడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చిందని, మెరిట్ ప్రకారం కాదని వారు చెబుతున్నారు. దీన్నిబట్టి కచ్చితంగా లీకేజీ జరిగే ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. నిజంగానే పరీక్ష రద్దు చేసే నిర్ణయం అధికారులు తీసుకుంటే ఊరుకోబోమని పలువురు అభ్యర్థులు అంటుంటే.. ఇంకొందరు కొత్త నోటిఫికేషన్ వస్తే వయోపరిమితి కారణంగా ఎంతోమంది అర్హత కోల్పేయే ప్రమాదం పొంచిఉందని, దీంతో చాలా మంది నిరుద్యోగులకు శాపంగా మారుతుందని వాపోతున్నారు. గ్రూప్ 1 లీకేజీ అంశం నిజమేనా? మరి దీనిపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed