రీల్స్ చూస్తూ స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. పురిటి బిడ్డ బలి

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-13 08:59:35.0  )
రీల్స్ చూస్తూ స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. పురిటి బిడ్డ బలి
X

దిశ, వైరా : ఓ తల్లి నవ మాసాలు తన గర్భంలో పెంచుకున్న పసి బాలికని నిర్లక్ష్యపు వైద్యం బలిగొంది. నొప్పులతో పురుడు పోసుకోవాల్సిన గర్భిణీకి సగం డెలివరీ చేసి వైద్యుడు, సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో అభం శుభం తెలియని ముక్కు పచ్చలారని బాలిక ఉమ్మనీరు తాగి మృతి చెందాడు. ఈ ఘటనపై గర్భిణీ బంధువులు వైద్యుడిని నిలదీయగా పురుడు పోసే సమయంలో చిన్నారులు చనిపోవడం సహజమని చెప్పటం విశేషం. ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ దడిపల్లి లావణ్య తనకు డెలివరీ డేట్ కావడంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు తల్లాడ లోని పీహెచ్‌సీకి వెళ్ళింది. అయితే తల్లాడ పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ రత్న మనోహర్ శుక్రవారం తన విధులకు సెలవు పెట్టారు. దీంతో అన్నారుగూడెం పల్లె దవాఖాన వైద్యుడు వై గోపి తల్లాడ పీహెచ్సీలో ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించారు. గర్భిణీ లావణ్యకు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో లావణ్య భర్త అశోక్ స్టాఫ్ నర్స్ కళావతి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు.

అయితే సెల్ ఫోన్‌లో రీల్స్ చూసుకుంటున్న కళావతి పురిటి నొప్పులు అలానే వస్తాయని, మరో రెండు గంటలు నొప్పులు రావాల్సి ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు వస్తుంటే సెల్ ఫోన్‌లో రీల్స్ చూసుకుంటూ స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించారు. ఆ తర్వాత అన్నారుగూడెం నుంచి తల్లాడ పీహెచ్‌సీకి వచ్చిన వైద్యుడు గోపి తమ సిబ్బందితో కలిసి లావణ్యకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బాలిక తలభాగం కొంతమేరకే బయటకు వచ్చింది.

మిగిలిన భాగం బాలిక బయటికి రాకపోవడంతో పాటు లావణ్య పల్స్ రేటు పడిపోయింది. దీంతో వెంటనే వైద్యుడు గోపి సగం పురుడు పోసిన మహిళను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆమె బంధువులకు తెలిపాడు. దీంతో గర్భిణీ మహిళ భర్త అశోక్ తో పాటు వారి బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. అదే సమయంలో పీహెచ్‌సీ పక్కనే ఉన్న 108 వాహనంలో ప్రమాదకరంగా ఉన్న గర్భిణీ మహిళను ఖమ్మం తరలించాలని ఆ సిబ్బందిని లావణ్య బంధువులు వేడుకున్నారు. అయితే 108 వాహన సిబ్బంది ఇది క్రిటికల్ కేస్ అని తాము తీసుక పోలేమని చేతులెత్తేయటం గమనార్హం.

గర్భిణీ మహిళ బంధువులు ఆందోళన చేస్తుండటంతో వైద్యుడు వై గోపి సగభాగం బయటికి వచ్చిన బాలికను బలవంతంగా బయటికి తీశారు. అప్పటికే ఉమ్మనీరు తాగిన బాలిక మృతి చెందింది. అనంతరం అపస్మారక స్థితికి వెళ్లిన లావణ్యను ఆమె భర్త బంధువులు దిక్కు తోచని స్థితిలో కారులో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యపు వ్యవహారంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో డాక్టర్ గోపి మాట్లాడుతూ తాను చాలా డెలివరీలు చేశానని, చిన్నారులు ఇలా చనిపోవడం సహజమని చెప్పటం విశేషం. ఇదిలా ఉంటే లావణ్య కుటుంబ సభ్యులు ఆందోళన చేసే సమయంలో స్టాఫ్ నర్స్ కళావతి కుమారుడు మండల వైద్యాధికారి కుర్చీలో కూర్చొని హల్‌చల్ చేయటం విశేషం.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేపించుకోవాలని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తమ గ్రామానికి వచ్చి బలవంతం చేయటం వల్లే తల్లాడ పీహెచ్‌సీకి గర్భిణీ మహిళ లావణ్య వెళ్ళింది. ఆమె అంతకు ముందు వరకు వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, బాధిత మహిళ బంధువులుతో శనివారం చర్చలు జరిపారు. ప్రస్తుతం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య వైద్య ఖర్చులు భరించటంతో పాటు మరో రూ.10 వేలను నష్టపరిహారంగా ఇచ్చేందుకు వైద్యుడు అంగీకరించటంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఏది ఏమైనా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరగటంతో ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిల్లుతోంది.

Advertisement

Next Story

Most Viewed