సమాచార హక్కు చట్టం బోర్డులేవి..?

by Naveena |   ( Updated:2024-12-16 11:34:03.0  )
సమాచార హక్కు చట్టం బోర్డులేవి..?
X

దిశ,యాదాద్రి కలెక్టరేట్ :సామాన్యునికి వజ్రాయుధం లాంటి చట్టమైన సమాచార హక్కు చట్టానికి జిల్లా అధికార యంత్రాంగం తూట్లు పొడుస్తోంది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సామాన్యులు చట్టానికి లోబడి ఏ సమాచారాన్ని అయినా పొందే అవకాశం కల్పించింది. ఈ చట్టంలో భాగంగానే అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ బోర్డులలో పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నెంబర్, అప్పిలేట్ అధికారి పేరు, ఫోన్ నెంబర్ ముద్రించి ఉండాలని చట్టం చెప్తుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నిబంధనను అధికారులు ఉల్లంఘిస్తున్నారు. ఒకటి రెండు శాఖలు మినహాయిస్తే అన్ని శాఖలలో సమాచార హక్కు చట్టం బోర్డులు కనిపించడం లేదు. ముఖ్యంగా నిత్య ప్రజలతో మమేకమయ్యే జిల్లా స్త్రీ శిశు వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలు ఈ బోర్డులు ఏర్పాటు చేయడంలో..నిర్లక్ష్యం వహిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయని శాఖలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

బోర్డులు తప్పనిసరి

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పించే బోర్డులు ఏర్పాటు చేయాలని చట్టం సూచిస్తుంది. చట్టంలోని సెక్షన్ 4 (1) (బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖ లేదా కార్యాలయం దాని కార్యకలాపాల గురించి ప్రధాన సమాచారాన్ని ప్రజల అవగాహన కోసం ప్రదర్శించాలి. ఇందులో పౌరులకు అవసరమైన సమాచారం ఉంటుంది. ఈ విధి అమలులో విఫలమైతే, సంబంధిత శాఖలపై ప్రభుత్వం లేదా సమాచార కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. చట్టంలో పేర్కొన్నట్లు, ప్రతి పబ్లిక్ అథారిటీ వారి కార్యాలయంలో తమ విధులు, పనితీరు, విధానాలు, నియమాలను పారదర్శకంగా బహిరంగపరచాల్సి ఉంటుంది. బోర్డుల ఏర్పాటు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటం ఈ నిబంధన కింద వస్తుంది. సెక్షన్ 19 (8) ప్రకారం ఇన్ఫర్మేషన్ కమిషన్‌కి (సెంట్రల్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్) వీటిని పర్యవేక్షించి, అవసరమైతే, చర్యలు తీసుకునే అధికారం ఉన్నట్లు చట్టం పేర్కొంటుంది. సమాచార కమిషన్ ఆదేశాల ప్రకారం సంబంధిత శాఖ బోర్డులు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేస్తే కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. తగిన వ్యవధిలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. సంబంధిత శాఖల అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంలో విఫలమైతే, కమిషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా సంబంధిత అధికారి పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చట్టం ప్రకారం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పై రోజుకు రూ.250 (గరిష్టంగా ₹25,000 వరకు) జరిమానా విదించే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పరిపాలన చర్యలు కూడా చేపట్టవచ్చు అని చట్టం వెల్లడిస్తుంది. కానీ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

Advertisement

Next Story