అనుమతి లేకుండా వార్డెన్ విదేశీ పర్యటన...

by Kalyani |
అనుమతి లేకుండా వార్డెన్ విదేశీ పర్యటన...
X

దిశ, నల్గొండ బ్యూరో : ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళు ఎవరైనా విదేశీ పర్యాటన వెళ్లాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని సెలవు కి వెళ్ళవచ్చు. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగి జిల్లా కలెక్టర్ కాదు కదా కనీసం తాను పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి అనుమతి కూడా తీసుకోలేదు. ఎలాంటి సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్ అనుమతి లేకుండా వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించి నట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో బాలికల హాస్టల్ వార్డెన్ గా పనిచేసే అధికారి 2019 డిసెంబర్ 19వ నుంచి 25వ తేదీ వరకు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది.

సహజంగా అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వార్డెన్ సాధారణ సేవలు పెట్టి బయట దేశానికి వెళ్లి వచ్చారని సమాచారం. ఆ తర్వాత డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎలా దేశం దాటి వెళ్లారని ప్రశ్నించారు. దానికి ఆ వార్డెన్ తనను డివిజన్ అధికారి వేధిస్తున్నారని అప్పట్లో పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఆ డివిజన్ అధికారి వార్డెన్ వేధింపులు తట్టుకోలేక తన సర్వీస్ ఇంకా రెండేళ్లు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఆ వార్డెన్ అధికారులందరినీ ప్రలోభాలకు గురిచేసి మేనేజ్ చేసినట్లు తెలిసింది.

అయితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం అలవాటుగా మారిందని వినికిడి. గతంలో దాదాపు ముగ్గురు విద్యార్థి నాయకుల పై కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తన తోటి ఉద్యోగులను కూడా సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేస్తారని డిపార్ట్మెంట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ వార్డెన్ విషయాలు పూర్తిగా తెలిసినప్పటికీ నోటి దురుసు తనానికి భయపడి ఎవరూ కూడా బయటికి చెప్పకుండా జాగ్రత్త పడతారని సమాచారం. ప్రభుత్వ అనుమతిలేకుండా విదేశీ పర్యటన చేసిన వార్డెన్ పై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన పాస్ పోర్ట్ ను పూర్తిస్థాయిలో చెక్ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story