- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రిప్ ఇస్తలే.. పెండింగ్‌లో వేల దరఖాస్తులు..
దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న చందంగా ఉంది. వ్యవసాయాన్ని పండుగలా చేస్తామంటూ ఓవైపు గప్పాలు కోడుతోంది. కాని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుస్తున్న పథకాలేవీ క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేకూర్చడం లేదు. ఉద్యానవన శాఖ పరిధిలో పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసేందుకు సబ్సిడీ మీద రైతులకు ఉచితంగా డ్రిప్ పైపులను అందించాల్సి ఉంది. ఇందులో పండ్ల తోటలు, మిరప, కూరగాయాలు, ఆయిల్ పామ్ తదితర పంటలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. గత మూడేండ్లుగా రైతులకు ఉద్యానవన శాఖ పరిధిలో డ్రిప్ పైపులను అందించడం మానేశారు. నల్లగొండ జిల్లా పరిధిలో కేవలం ఒక్క ఆయిల్ పామ్ తోటల సాగుకు మాత్రమే డ్రిప్ పైపులను అందిస్తున్నారు. మిగతా ఏ పంటలకూ డ్రిప్ అందించకపోవడంతో నెలల తరబడి వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో లాభసాటి పంటలను పక్కన పెట్టి.. మూస పద్ధతిలో వరి, పత్తి పంటలను సాగు చేయడానికి రైతాంగం పరిమితమవుతోంది.
నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..
నల్లగొండ జిల్లా ఉద్యానవన శాఖలో డ్రిప్ పరికరాలను అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారనే చెప్పాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డ్రిప్ పరికరాల కోసం 11,866 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఇప్పటివరకు 764 మంది రైతులకు మాత్రమే డ్రిప్ పరికరాలను అందించడం కొసమెరుపు. జిల్లాలో 40,479వేల ఎకరాల్లో డ్రిప్ సిస్టమ్ ద్వారా పంటలు సాగు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 3821 ఎకరాలకు మాత్రమే డ్రిప్ పరికరాలను అందించారు. అంటే కేవలం 7 శాతం మంది రైతులకు డ్రిప్ పరికరాలను అందించడం పట్ల ఇటు ప్రభుత్వానికి అటు అధికార యంత్రాంగానికి వ్యవసాయం పట్ల.. రైతుల పట్ల ఎంత అంకితాభావం ఉందో అర్ధమవుతోంది. గత మూడేండ్లలో డ్రిప్ పరికరాల కోసం 13,410 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 2308 మంది రైతులకు మాత్రమే మంజూరు చేయడం కొసమెరుపు. గతంలో డ్రిప్ పరికరాల కోసం రైతుకు ఎకరాకు అదనంగా రూ.3వేల వరకు ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం రూ.8వేల వరకు అదనపు భారం పడుతుండడం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
కుంటుపడిన ఇతర పంటల సాగు..
నల్లగొండ జిల్లాలో డ్రిప్ పరికరాలను కేవలం ఆయిల్ పామ్ తోటల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే మంజూరు చేస్తున్నారు. చెరుకు, కూరగాయలు, పండ్ల తోటలు, ఆకుకూరలు, చెరుకు, ఎర్రచందనం, శ్రీగంధం తదితర పంటలను సాగు చేయాలంటే డ్రిప్ తప్పనిసరి. ఉద్యానవన శాఖ అధికారులు డ్రిప్ పరికరాలను అందించకపోవడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడుతుంది. సగటున ఒక్కో ఎకరాకు డ్రిప్ పరికరాలను అమర్చుకోవాలంటే.. రూ.50వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికితోడు డ్రిప్ పరికరాల ద్వారా పంటలకు నీటిని అందిస్తే.. ఆర్థిక భారం తప్పడమే కాదు.. ఇతర ప్రయోజనాలు లేకపోలేదు. డ్రిప్ సిస్టమ్ వల్ల నీరు ఎక్కువగా వృథా అయ్యే అవకాశం లేదు. నేరుగా మొక్క కాండానికి నీరు తగిన మోతాదులో చేరడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది. నీరు పారుగంత ద్వారా పంటలను సాగు చేస్తే.. కలుపు పెరగడం.. దిగుబడి తగ్గడం తదితర సమస్యలు రైతుకు నష్టం చేకూరుస్తాయి.
వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం..
గత మూడునాలుగేండ్లుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పాలి. వరి పంట మినహా ఇతర పంటలేవీ చెప్పుకోదగిన దిగుబడులను సాధించలేదు. ప్రధానంగా పత్తి సాగు అధ్వానంగా ఉంది. పత్తి రైతులకు సరైన మార్కెంటింగ్ లేక.. కాలం కలిసిరాక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మితిమీరిన ఎరువుల వాడకం.. దున్నకం, వ్యవసాయ కూలీల ఖర్చు పెరగడం తదితర అంశాలు నష్టాలకు కారణంగా మారాయి. అయితే నిజానికి డ్రిప్ సిస్టమ్ వల్ల భూగర్బ జల వనరులు పొదుపు కావడంతో పాటు వ్యవసాయంలో రైతులకు అదనపు భారం తగ్గుతుంది. డ్రిప్ వల్ల కలుపు పెద్దగా పెరగదు. ఎరువులను సైతం ద్రవ రూపంలో డ్రిప్ పైపుల ద్వారా నేరుగా మొక్క కాండానికి చేర్చడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది. కూలీల ఖర్చు ఉండదు. దీంతో రైతులకు పంటల సాగు విషయంలో ఎంతో వ్యయప్రయాస తప్పుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కకు నెట్టి.. కేవలం రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామనే చెబుతూందే తప్ప.. రైతులకు కావాల్సిన టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే.. ఎవరి సాయం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని అంతా మర్చిపోతుండడం గమనార్హం.
మార్కెటింగ్ అవకాశాలు లేకపోవడంతో అనాసక్తి..
నల్లగొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలనే ఉద్దేశంతో అధికారులు దీనికే డ్రిప్ పరికరాలను అందిస్తున్నారు. అయితే నిజానికి ఆయిల్ పామ్ సాగుకు మన జిల్లాలో పెద్దగా మార్కెటింగ్ అవకాశాలు లేవు. సరికదా.. ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలోనన్న ఆందోళనను అధికారులు పోగొట్టడం లేదు. సకాలంలో ఆయిల్ పామ్ గేలలను విక్రయించుకోలేకపోతే.. అవి బూజు పట్టి ఎందుకు పనికి రాకుండాపోతాయి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి పరిస్థితులను రైతులు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఊపందుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు రైతులకు ఆయిల్ పామ్ మార్కెటింగ్ అవకాశాలు, అందులోని లాభాలను వివరించేగలిగితే రైతులకు మంచి ప్రయోజనం చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్నఆయిల్ ఫామ్ తోటల దిగుబడులను కొనుగోలు చేసేందుకు పతాంజలి సంస్థతో ఒప్పందం కుదిరింది. అయితే ధర ఎంత అనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. రైతుకు నచ్చిన ధరకు విక్రయించడం సాధ్యమయ్యే పనికాదు. అదే కూరగాయాలు లేదా మిరప పంటలను సాగు చేస్తే.. మార్కెట్‌లో కాకుంటే.. బహిరంగ మార్కెట్‌లోనో.. నేరుగా వినియోగదారులకు రైతు తనకు నచ్చిన ధరకు అమ్ముకునే వీలుంటుంది. కానీ ఆయిల్ ఫామ్ సాగు విషయంలో ఆ పరిస్థితి లేదు. అయితే ఇప్పటివరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ దిగుబడులు పెద్దగా ప్రారంభం కాలేదు. ప్రారంభమైతేనే అసలు విషయం తెలుస్తుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క ఆయిల్ ఫామ్ సాగుకే ఇస్తం..
నల్లగొండ జిల్లాలో ఒక్క ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులకు మాత్రమే డ్రిప్ పరికరాలను అందిస్తున్నాము. మిగతా పంటలకు 600 ఎకరాలకు మాత్రమే ఇచ్చే టార్గెట్ ఉంది. అది ఇప్పటికే పూర్తయ్యింది. ఇక ఆయిల్ ఫామ్ సాగు 3500 ఎకరాలు టార్గెట్ ఉంటే.. ఇప్పటికే 3100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. వచ్చే ఏడాది కోటా వస్తేనే.. ఇతర పంటలకు డ్రిప్ ఇవ్వగలుగుతాం. ప్రస్తుతానికి ఒక్క ఆయిల్ పామ్ సాగుకే ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి.
- సంగీతలక్ష్మీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
- Tags
- Nalgonda