collector : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

by Kalyani |
collector : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ,సంస్థాన్ నారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ప్రిన్సిపాల్ గదిలో కూర్చున్న జిల్లా కలెక్టర్ విద్యార్థులు,సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సిబ్బంది హాజరుపై కలెక్టర్ ప్రిన్సిపాల్ పై సీరియస్ అయ్యారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.విద్యార్థులను ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడగగా వారు పెడుతున్నారని సమాధానం ఇచ్చారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ ని పరిశీలించిన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్టోర్ రూమ్ లో పరిశుభ్రతను పాటించి క్రమ పద్ధతిలో అమర్చాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిద్రిస్తున్న డార్మెటరీ హాల్ ను సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాలలో ఎన్సీసీ ఏర్పాటుచేసి క్రీడలలో ప్రోత్సాహం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కావలసిన క్రీడా సామాగ్రి వివరాలు అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. అదేవిధంగా ఉదయం ఏడు గంటల లోపు బూస్ట్, టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వరకు ఎలాంటి స్నాక్స్ ఇవ్వడంలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 9 గంటల తర్వాత విద్యార్థులకు స్నాక్స్ అందేలా చూడాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పలు సబ్జెక్టులపై ప్రశ్నలను అడిగారు.

పిల్లలు ఇంగ్లీష్ సబ్జెక్టులో కాస్త వెనుకబడినట్లు గుర్తించిన కలెక్టర్ స్పెషల్ క్లాసులు తీసుకోవాలంటూ ప్రిన్సిపాల్ కి సూచించారు. వర్షాకాలం అయినందున విష జ్వరాలు ప్రబలకుండా సరైన శానిటేషన్ పాటించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. సుమారు రెండు గంటల పైగా గురుకుల పాఠశాలలోనే జిల్లా కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ అంగన్వాడి పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట నారాయణపురం తహసీల్దార్ ఏం.కృష్ణ, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీఓ జనార్దన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్ఐ కట్ట పాండు తదితరులున్నారు.



Next Story