తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం : గుత్తా

by Sridhar Babu |
తెలంగాణ పథకాలు దేశానికే  ఆదర్శం : గుత్తా
X

దిశ, మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే మోడల్ గా నిలుస్తున్నాయని, సంక్షేమ పాలనను ప్రజలు ఆదరించాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేండ్ల పాలనలో వ్యవసాయ రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 12 లక్షల 4 వేల 850 మంది పేద యువతులకు రూ. 10,485 కోట్ల సొమ్ము అందించిన సీఎం కేసీఆర్ వారందరికీ మేనమామ గా నిలిచాడని పేర్కొన్నారు.

రైతు బంధు పథకం ద్వారా రూ.65 వేల కోట్లు, రైతు బీమా కింద రూ.5 వేల కోట్లు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్య పథకాలతో పేదలు, రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ పథకాల వలన కలిగిన లబ్ది ని వివరిస్తూ త్వరలో పుస్తకం ముద్రిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఏ పథకం ద్వారా ఎంత లాభం జరిగిందో గుర్తించి తిరిగి ఆశీర్వదించాలని కోరారు.

త్వరలో డ్రా పద్ధతి లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తామని, సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో చెన్నయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ విజయ సింహ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed