భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు…

by Kalyani |
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు…
X

దిశ, హుజూర్ నగర్ : లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణహత్యలకు పాల్పడిన వారిపై అలాగే ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. గత మూడు రోజుల క్రితం చివ్వెంల మండలం ఎంజీ తండాకు చెందిన సుహాసిని గర్భవిచ్ఛితి జరిపిన హుజూర్ నగర్ పట్టణంలోని న్యూ కమల హాస్పిటల్ ను శనివారం ఆకస్మిక తనిఖీ చేసి ఆస్పత్రిలో రికార్డులను సేకరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న న్యూ కమల హాస్పటల్ ను అనుమతులు లేని కమల డెంటల్ హాస్పిటల్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలమైన ఆడ శిశువులను స్కానింగ్ చేసి కడుపులోనే చంపేయడం దారుణమని అన్నారు.

జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని కొంతమంది ఆర్ఎంపీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు ప్రజలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించిన, నిర్వహించిన ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆశా కార్యకర్తలు లింగ నిర్ధారణ భ్రూణ హత్యలపై ప్రభుత్వం రూపొందించిన చట్టాల తీవ్రతను ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి .ఎం & హెచ్ .ఓ నిరంజన్, అంజయ్య, కార్తీక్,ఇందిరాల రామకృష్ణ పాల్గొన్నారు.

Next Story