- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టం అక్కడ.. ఫలితం ఇక్కడ
దిశ, తుంగతుర్తి : ఒకటి కాదు.. రెండు కాదు.. పది అంతకంటే కాదు.. ఏకంగా 23 ఏళ్ల పాటు ఓ పార్టీలో కష్టపడితే ఫలితం మాత్రం మరో పార్టీ వద్ద దక్కింది. ఇది తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన మందుల సామెల్ పరిస్థితి. ఫలితం దక్కే ముందు రోజు వరకు కూడా మందుల సామెల్ రాజకీయ జీవితం "క్లోజ్" అయ్యిందంటూ చెప్పుకొచ్చిన వారికి ఇప్పుడు ఆయన విజయంతో పాటు మెజారిటీ చూసి “షాక్” మీద “షాక్” తగిలినట్లుగా మారింది. అసలు ఎవరు కూడా ఊహించని రీతిలో తిరిగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు అంతటా చర్చగా మారింది. 64 ఏళ్ల వయసున్న మందుల సామెల్ కొత్తగా ఏర్పాటైన అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో అత్యంత పేదరిక కుటుంబంలో జన్మించారు. వివిధ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించిన సామెల్ 2001లో బీఆర్ఎస్ లో చేరి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
2006లో ఎస్సీ సెల్ విభాగం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా, 2007 నుంచి 2016 వరకు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులుగా, 2008 నుండి 2014 వరకు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా కొనసాగారు. 2015లో ఉమ్మడి మెదక్ జిల్లాకు పార్టీ స్టీరింగ్ కమిటీ ఇన్చార్జిగా, 2018 నుండి 2022 వరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన సామెల్ కు 2016లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా రెండు మార్లు నియమితులయ్యారు. ముఖ్యంగా 2013లో తుంగతుర్తి ఇన్చార్జిగా పనిచేస్తున్న కాలంలోనే సామెల్ నియోజకవర్గ వ్యాప్తంగా 45 మంది సర్పంచులుగా గెలిపించుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సామెల్ తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ కాలం కలిసి రాక భంగపడ్డారు. చివరికి 2023లో అవకాశం వస్తుందని ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో విరక్తి చెందిన సామెల్ ఆరు మాసాల ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశించారు. అయితే అప్పటికే టికెట్ ను ఆశిస్తున్న 24 మంది ఆశావాదుల పై పార్టీ పరంగా జరిగిన వివిధ రకాల సర్వేలలో మందుల సామెల్ పేరే తెరపై కొచ్చింది. చివరికి నామినేషన్ల చివరి తేదీ ముందు రోజు (అంటే డిసెంబర్ 9న రాత్రి) తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా సామెల్ పేరు ఖరారైంది. ఇదంతా రాజకీయాల్లో సంచలనమైంది.
ప్రతి రౌండ్ లో వేలలో మెజార్టీ..
అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రను కాంగ్రెస్ అభ్యర్థి సామెల్ తిరగరాశారు. గత ఎన్నికల (అంటే 2018) నాటికి తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి 15మార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతి ఎన్నికల్లో రౌండ్లపరంగా వందల సంఖ్యలో మాత్రమే మెజార్టీ వస్తుండేది. కాకుంటే అడపాదడపాగా కొన్ని రౌండ్లలో మాత్రమే 15 వందలలోపే మెజారిటీ కొనసాగింది. అయితే ఈసారికి 16వ ఎన్నికకు (అంటే 2023) వచ్చేసరికి ప్రతిరౌండ్ లో వచ్చిన మెజార్టీ చరిత్రనే తిరగరాసింది. మొత్తంగా ఉన్న 19 రౌండ్లలో పరిశీలిస్తే.. ప్రతి రౌండ్ లో మెజార్టీ సంఖ్య వేలలో కొనసాగింది. మొదటి రౌండ్ లోనే కాంగ్రెస్ అభ్యర్థి సామెల్ కు 3 వేల 447 మెజార్టీ రాగా రెండో రౌండ్ కు వచ్చేసరికి 2,485, మూడో రౌండ్ కు 3 వేల 211, నాలుగో రౌండుకు 3 వేల 017 ఓట్ల మెజారిటీ లభించింది.
అలాగే 5 వ రౌండ్ లో 2 వేల 525, ఆరో రౌండులో 2 వేల 164 ఓట్లు, 7 వ రౌండులో 2,564 ఓట్లు, 8 వ రౌండ్ లో 2 వేల 376, తొమ్మిదో రౌండ్ లో 1671, ఓట్ల మెజారిటీ లభించింది. ఇక 10వ రౌండ్ కి వచ్చేసరికి 3038, 11వ రౌండ్ లో 2314, 12 వ రౌండ్ లో 2019 ఓట్ల మెజారిటీ లభించింది 13 వ రౌండులో 2688, 14వ రౌండ్ లో 2752, 15వ రౌండ్ లో 1508, 16వ రౌండ్ లో 3439, 17వ రౌండ్ లో 2375, 18వ రౌండులో 2570 ఓట్ల మెజారిటీ లభించింది. ఇక చివరి 19వ రౌండ్ కు వచ్చే సరికి ఇక్కడ ఓట్లు తక్కువగా ఉన్నాయి. అయినా ఈ రౌండ్ లో 270 మెజార్టీ లభించడం విశేషం. మొత్తంగా చూస్తే మందుల సామెలుకు 50,253 ఓట్ల మెజార్టీ రావడం తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా చేరింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి సామెల్ కు ఒక లక్ష 28,311 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కు కేవలం 78,058 ఓట్లు వచ్చాయి.