Rural roads : పల్లె రోడ్లకు మోక్షమెప్పుడో...నరకయాతనగా ప్రయాణం...

by Kalyani |
Rural roads : పల్లె రోడ్లకు మోక్షమెప్పుడో...నరకయాతనగా ప్రయాణం...
X

దిశ,చండూరు: అధికారుల నిర్లక్ష్యం,పాలకుల అలసత్వంతో గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారి, చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో పాటు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడి గుంతలల్లో నీరు నిలుస్తుండటంతో గుంతలు గమనించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే నరకం కనబడుతుందని గ్రామస్తులు ఆందోళన పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లకు మరమ్మత్తుల పనులు చేపట్టాలని కోరుతున్నారు.

నరకయాతనగా రోడ్లు...

మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీలు చొప్పరివారి గూడెం, పడమటి తాళ్లా, జోగిగూడెం, తిమ్మారెడ్డి గూడెం గ్రామపంచాయతిల రోడ్లు వర్షం పడిందంటే పట్ట పగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కంకర తేలిన రోడ్డు పై ప్రయాణం చొప్పరివారి గూడెం ప్రజలకు నరకయతనగా మారిందని ప్రజలు వాపోతున్నారు. బంగారిగడ్డ, ధోనిపాముల గ్రామాలల్లో ప్రజల పరిస్థితి విచిత్రంగా ఉంది. టిప్పర్ల వల్ల తారు రోడ్డు పూర్తిగా గుంతలు కావటంతో మట్టి పోశారు. వర్షాలకు రోడ్డు మొత్తం బురద గా మారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వర్షం పోయిందంటే దుమ్ముతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులకు హడావిడిగా శంకుస్థాపన చేసినప్పటికీ ఎన్నికల్లో అపార్టీ ఓటమిపాలు కావటంతో ఆ పనులు శంకుస్థాపనకే పరిమితం అయ్యాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల నిర్మాణానికి పూనుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story