- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా కోరల్లో చెరువులు.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే భూ దందా
దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలు అని చూడకుండా ఆక్రమించేస్తున్నారు. అక్రమార్కులకు రాజకీయ నేతలు అండదండలు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో సుమారు 20 ఎకరాల చెరువును కబ్జా చేశారు. కోదాడ పెద్ద చెరువు సైతం కబ్జాకి గురవుతోంది. కోదాడ నడిబొడ్డున ఉండడంతో భూమికి భారీ డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే గజం భూమి కనపడ్డ వదిలిపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది.
దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ కబ్జా చేసేందుకు పొలిటికల్ పవర్ ఉన్నవాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే కోదాడ పెద్ద చెరువు శిఖం భూములు గతంలోనే కబ్జాకు గురై అధికారులు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు. చెరువు శిఖం భూములతో పాటు చెరువును సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి చెరువు ఎండిపోవడంతో వంద, రెండు వందల గజాలంటూ మట్టిని పోస్తూ చదును చేసుకుంటున్నారు. కోదాడ పట్టణంలోని 27వ వార్డులో ఎర్రగుంట కాలువ వద్ద కూడా మట్టి పోసి కాల్వను కబ్జా చేసేందుకు అక్రమార్కుల సిద్ధమైపోయారంటే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉర చెరువులపై అక్రమార్కుల కన్ను పడిందనే చెప్పుకోవాలి.
ఇష్టానుసారంగా చెరువులో మట్టి తరలింపు..
ప్రస్తుతం తీవ్రమైన వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని చెరువులు అడుగంటాయి. ఇన్ని రోజులు నీటితో కళకళలాడిన చెరువులు పూర్తిస్థాయిలో ఎండిపోవడంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా అక్రమార్కులకు వరంగా మారాయి. మట్టి మాఫియాకు మాత్రం చెరువులు కల్ప వృక్షాలుగా మారాయి. ఎండిన చెరువుల్లో జేసీబీలతో మట్టిని తవ్వి రాత్రి పగలు లేకుండా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్లు తవ్వకాలు చేపడుతుండడంతో చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. మనుషులు, పశువులు తెలియక అటువైపు వెళితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. మరి కొంతమంది అక్రమార్కులు చెరువు అంచుల వెంబడి మట్టి పోస్తూ భూమిని ఆక్రమించేందుకు చూస్తున్నారు.
సమన్వయ లోపం..
జిల్లాలో పంట భూములకు చెరువులే ఆధారం. చెరువుల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. చెరువును నమ్ముకొని పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారని, చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఫలితం లేకుండాపోతోంది. రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారుల మధ్య సమన్వయం లోపం రైతుల పాలిట శాపంగా మారింది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీంతో యథేచ్ఛగా చెరువు శిఖం భూములతో పాటు చెరువును సైతం కబ్జా చేస్తున్నారు.
హద్దులతో అడ్డుకట్ట..
కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటల శిఖం భూములు వాస్తవంగా ఎంత ఉన్నాయో గుర్తించి సర్వే చేసి హద్దులు నాటించాలి. రికార్డుల పరంగా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చర్యలకు ఉపక్రమించాలి. గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటల పునరుద్ధరణ చేశారు. అధికారులు స్పందించి హద్దులు విధిగా గుర్తించి, సరిహద్దుల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలి.
చెరువులు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు..
చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. చెరువులు కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు చేస్తే పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చెరువుల చుట్టూ బౌండరీలు బోర్డులు ఏర్పాటు చేసి ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేస్తాం. - ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ