Munugode bypoll ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు

by samatah |   ( Updated:2022-10-07 11:33:11.0  )
Munugode bypoll ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన పోలీసు బలగాలు
X

దిశ, మర్రిగూడ : మునుగోడు ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. వచ్చేనెల 3 న నిర్వహించే పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లలో నిమగ్నం అయింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో ఎన్నికల కమిషన్ ఏర్పాట్లపై దృష్టిసారించింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మండలానికి 500 మంది పోలీసుల చొప్పున విధులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో 3 పోలీస్ అవుట్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను ,డబ్బు తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు చేయనున్నారు. శుక్రవారం మునుగోడు మండల పరిధిలో నిర్వహించిన ఔట్ పోస్టింగ్ తనిఖీలు రూ.13 లక్షలు పట్టుబడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా జరగనుంది. అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఏది ఏమైనా మునుగోడు ఉపఎన్నిక పోరు ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములాగా మారింది.

ఇవి కూడా చదవండి : Munugode bypoll : ముగిసిన తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ.. బరిలో ఇద్దరు నేతలు

Advertisement

Next Story

Most Viewed