కాంగ్రెస్ బోగస్ హామీలను జనం నమ్మరు..మంత్రి జగదీష్ రెడ్డి

by Sumithra |
కాంగ్రెస్ బోగస్ హామీలను జనం నమ్మరు..మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, సూర్యాపేట : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నెరవేరని హామీలు.. తామూ అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా.. అన్న తరహాలో ఉన్నాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అన్నీ బోగస్ లా ఉన్నాయన్నారు. ప్రజలను మోసగించడం కాంగ్రెస్ కు అలవాటు అన్న మంత్రి, కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజలవైపు లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఏనాడూ లేకపోవడమే కాకుండా ఉండబోదన్నారు. గత 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారు దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాదా అని ప్రశ్నించారు.

అధికారం కోసం ఇక్కడి నేతల స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇచ్చిన హామీలు భఫూన్, బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ధోరణితోనే పథకాలను కాపీకొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ర్టానికో మ్యానిఫెస్టో పెట్టి తెలంగాణ ప్రజలను కూడా మోసంచేయాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. నూటికి నూరు శాతం చెప్పినవి అమలు చేసి, మ్యానిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్షగా వర్ణించారు. మంత్రితో పాటు ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్థి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి క్యాంపు కార్యాలయంలో గణేషుడి వేడుకలు..

వినాయ‌కచ‌వితి వేడుకలను సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయం ప్రాంగ‌ణంలో మ‌ట్టి వినాయ‌కుడిని ప్ర‌తిష్టించిన మంత్రి జగదీష్ రెడ్డి - సునీత దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, సూర్యాపేట ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశుడిని ఈ సంద‌ర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి వేడుకున్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి తండ్రి గుంటకండ్ల చంద్రారెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి, ఎంపీపీ నెమ్మాధి బిక్షం, ఉప్పల ఆనంద్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రౌతు నరసింహారావు, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, ఈదుల యాదగిరి ముదిరాజ్, టీఆర్ఎస్వీ నేతలు ముదిరెడ్డి అనీల్ రెడ్డి, అనంతుల విజయ్, యలక హరీష్ రెడ్డి, వినయ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed