పండుగ పూట రోడ్డు ప్రమాదం.. కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

by Mahesh |
పండుగ పూట రోడ్డు ప్రమాదం.. కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
X

దిశ, మర్రిగూడ: మండల కేంద్రంలోని దోర్నాల బావి మూలమలుపు వద్ద ఈరోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్చా నాయక్ (35) అక్కడికక్కడే మృతి చెందాడు. తూర్పు తండాకు చెందిన జర్పుల బిచ్చా నాయక్ టూ వీలర్ పై శనివారం సాయంత్రం మండల కేంద్రానికి వస్తుండగా దోర్నాల బావి మూలమలుపు వద్ద కొండూరు గ్రామానికి చెందిన దుబ్బ శివ టు వీలర్ పై నుండి మర్రిగూడ నుంచి కొండూరుకు వెళ్తూ ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బిచ్చా నాయక్ ను వదిలి శివ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న బిచ్చా నాయక్ ను మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిచ్చ నాయక్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. బిచ్చా నాయక్ మృతి చెందిన విషయం తెలియడంతో బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు.

మృతికి కారణమైన శివ ఇంటి ముందు శవాన్ని ఉంచి ఆందోళన చేపట్టాలని మృతదేహంతో గిరిజనులు ప్రత్యేక వాహనంలో తరలి వెళ్లారు. మర్రిగూడ ఎస్ఐ కే రంగారెడ్డి చాకచక్యంతో వారి వాహనాన్ని మధ్యలో ఆపి వారిని వారించి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. బిచా నాయక్ మృతికి కారణమైన వ్యక్తిని చంపుతామని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుండడంతో పోలీసులు పోస్టుమార్టంకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గిరిజనులు అడ్డుపడి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు మోహరించారు. మృతునికి కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. గత దసరా రోజు మృతుని అన్న సైతం మరణించాడు.

మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి

బిచ్చా నాయక్ మృతికి కారణమైన వ్యక్తి నుండి మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని, మృతుని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకు వెళ్ళేది లేదని గిరిజనులంతా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒక వాహనంలో తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా గిరిజనులు అడ్డుకొని మృతదేహాన్ని వాహనం నుంచి కిందకి తీసి ఆసుపత్రి వద్ద ఉంచి ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చా నాయక్ మృతదేహంతో గిరిజనులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మృతుని బంధువులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కు తీసుకు వెళ్ళకుండా ఆందోళన చేపట్టడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సై కె .రంగారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.

Advertisement

Next Story