ఏప్రిల్ ఫస్ట్ నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

by Disha Web Desk 22 |
ఏప్రిల్ ఫస్ట్ నుండే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
X

దిశ, సూర్యాపేట : ఈ యాసంగి వరి పంటలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో గురువారం ఆయా శాఖల అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీ అధికారులు, సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆదేశించారు. జిల్లాలో ఈ యాసంగి వరి పంట 3,82,545 విస్తీర్ణంలో వరి పండించారని అందుకు 8,62,617 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ తెలిపారు.

వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 63 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 158, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2, 203, సాధారణ రకానికి రూ. 2,183 ధర చెల్లించడం జరుగుతుందన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ ఒకటి నుంచి 18 వరకు జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు, ధాన్యం శుద్ధి యంత్రాలు, టార్పాలిన్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బీఎస్. లత, డీఎస్ఓ మోహన్ బాబు, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణు మాధవ్, డీఎంఓ శర్మ, ఆర్టీఓ సురేష్ రెడ్డి, డీఎస్ఓ రాములు, తహశీల్దార్లు, వివిధ మిల్లుల యజమానులు, ఐకేపీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story