నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దు : ఎమ్మెల్యే

by Kalyani |
నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దు : ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలో కాలుష్యాన్ని వెదజల్లి ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దని ఇచ్చిన హనుమతులను వెంటనే రద్దు చేయాలని మునుగోడు శాసనసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యాదాద్రి, నల్గొండ జిల్లాలకు చెందిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గట్టుప్పల్, కృష్ణాపురం గ్రామాలలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. మునుగోడు నియోజకవర్గం పొల్యూషన్ లేని నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు సహకరించాలన్నారు. కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలపై చర్యలు తీసుకున్నారని ఎన్ని కంపెనీలకు నోటీసులు ఇచ్చారో తెలపాలని ఆయన అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో తెలపాలన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై వారం రోజుల్లో క్షుణ్ణంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.



Next Story