ధ్వజస్తంభ ప్రతిష్టాపన లో అపశృతి

by Disha Web |
ధ్వజస్తంభ ప్రతిష్టాపన లో అపశృతి
X

దిశ,తుంగతుర్తి: ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.ధ్వజస్తంభాన్ని తీసుకెళ్తున్న క్రేన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ మేరకు ధ్వజస్తంభం కూడా ముక్కలైపోయింది.చూస్తుండగానే క్షణాల్లోనే ఈ పరిణామం చేసుకోవడం గ్రామస్తులను నివ్వెరపరిచింది.అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు భయంతో పరుగులు పెట్టి ప్రాణాలను దక్కించుకున్నారు. అయినప్పటికీ ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.నూతనంగా నిర్మాణమైన ఆలయంలో విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్టింపచేయాలని గ్రామస్తులంతా నిర్ణయించుకొని మూడు రోజులు పరిధిలో ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు.ఈ మేరకు రెండు రోజులు ఉత్సవాలు దిగ్విజయవంతంగా ముగిసాయి.




మూడో రోజైన బుధవారం ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు మంచి ముహూర్తం,వేద మంత్రాల మధ్య క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించే స్థలం వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే బ్యాలెన్స్ తప్పడం వల్ల క్రేన్ ఒకవైపు ఒరిగిపోయి బోల్తా కొట్టింది.దీంతో ధ్వజస్తంభం ముక్కలుగా విరిగిపోయింది.దీన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో హాజరైన జనం భయభ్రాంతులతో పరుగులు తీసి ప్రాణాలన్ని దక్కించుకున్నారు. అయినప్పటికీ ఇరువురికి గాయాలయ్యాయి.ఈ సంఘటన పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story