Dindi Lift Irrigation Project : ఎట్టకేలకు డిండికి మోక్షం..

by Sumithra |   ( Updated:2025-01-06 02:08:35.0  )
Dindi Lift Irrigation Project  : ఎట్టకేలకు డిండికి మోక్షం..
X

దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లాలో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా శంకుస్థాపన చేసింది. కానీ ఎక్కడి నుంచి ప్రాజెక్టులోకి నీరు వస్తుందో స్పష్టత లేకుండానే దశాబ్ద కాలం క్రితం మొదలుపెట్టారు. కానీ ప్రాజెక్టులోకి నీటిని తీసుకురావడంలో స్పష్టత లేకపోవడంతో నిర్లక్ష్యానికి గురైంది. పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న డిండి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మోక్షం లభించినట్లు అయింది. ప్రాజెక్టుకు నీటి విడుదల ఎక్కడి నుంచి చేయాలో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇందుకోసం రూ.1800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం నిర్ణయంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టు పేరే డిండి ఎత్తిపోతల పథకం.

డిండి ప్రాజెక్టు...

డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 2015 సంవత్సరం జూన్ 11న 107 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 6190 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లాలో నల్గొండ, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సాగు, తాగునీరు సమస్య తీరుతుందని నాటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

రిజర్వాయర్ల నిర్మాణాలు..

డిండి ప్రాజెక్టుకు నీటిని ఎక్కడ నుంచి ఇస్తారో తేల్చకుండానే రిజర్వాయర్లు నిర్మించారు. వీటి కింద డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ చానల్స్ నిర్మాణానికి భూ సేకరణ కూడా జరపలేదు. అయితే ఐదు రిజర్వాయర్ల నిర్మాణ పనులను చేపట్టారు. అందులో సింగరాజుపల్లి, చింతపల్లి, చింతపల్లి (చెరువు), కిష్టరాయణ పల్లి (లక్ష్మణపురం), చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టారు. దాదాపు ఇప్పటి వరకు 70 శాతం వరకు వాటిని పూర్తి చేశారు. మిగతా చేయాల్సి ఉంది.

డిండి ప్రాజెక్టుకు నీటి మళ్లింపు ఇలా !!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం నుంచి రోజు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇందుకోసం రూ. 1800 కోట్లు వ్యయం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గత పదిహేళ్లుగా డిండి ప్రాజెక్టుకు నీళ్లు రావడం ఎట్లా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికినట్టే.

3.41 లక్షల సాగు.....

డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేశారు. ప్రధానంగా దేవరకొండ నియోజకవర్గంలో 1.33 లక్షల ఎకరాలు, మునుగోడు నియోజకవర్గంలో 1.76 ఎకరాలు, నల్లగొండ నియోజకవర్గంలో సుమారు 2వేలకు పైగా ఎకరాలు, దాంతో పాటుగా నకరికల్లు నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో కూడా సుమారు రెండువేల ఎకరాలకు నీరు అందుతుందని తెలుస్తుంది.

మండలాల వారీగా...

డిండి ప్రాజెక్టు పూర్తయితే మండలాల వారీగా సాగునీరందనుంది. దేవరకొండ నియోజకవర్గంలోని దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, పీఏ పల్లి మల్లేపల్లి చింతపల్లి, నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ , కనగల్, మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్, నారాయణపూర్, మునుగోడు, మర్రిగూడ ,నాంపల్లి, నగరికల్ నియోజకవర్గంలో చిట్యాల మండలం డిండి ప్రాజెక్టు నుంచి సాగు నీరందే అవకాశం ఉంది.

అక్కడ ప్రజల కష్టాలు తీరినట్లే...

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలో సాగునీరు అందుబాటులో లేకపోవడంలో ఇప్పటికీ ఆరుతడి పంటలు తప్ప వేరే పంటలు రైతులు సాగు చేసే అవకాశం లేదు. అంతే కాకుండా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ మహమ్మారి మనసుల ప్రాణాల్ని జీవచ్ఛవంలా మార్చేసింది. దీని అంతటికి కారణం తాగునీరు అందుబాటులో లేకపోవడమే. అయితే ఇప్పుడు దిండి ప్రాజెక్టు త్వరగా పూర్తయి నీటి విడుదల చేస్తే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గం సస్యశ్యామలం కావడంతో పాటు ఫ్లోరింగ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుందని చెప్పొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలకు డిండి ప్రాజెక్టు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే రైతులంతా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story