BRS అభ్యర్థి మల్లేష్‌కు ఎదురు గాలి.. నియోజకవర్గం అంతటా అసంతృప్తే..!

by Disha Web Desk 19 |
BRS అభ్యర్థి మల్లేష్‌కు ఎదురు గాలి.. నియోజకవర్గం అంతటా అసంతృప్తే..!
X

దిశ, నల్లగొండ బ్యూరో: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులతో రగిలిపోతుంది. ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి తమ నెత్తి మీద పెట్టారని.. అయినా ఎత్తుకొని తిప్పుదామన్నా జనంలోకి వచ్చేది లేదు కలిసేది లేదు.. గెలిచిన ఎట్లా అని ఆవేదనలో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు రగిలిపోతున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. అందులో నకరేకల్, భువనగిరి, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, జనగామ, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. ఈ ఏడింటిలో కేవలం జనగామలో మాత్రమే బీఆర్ఎస్‌కు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా ఆరు నియోజకవర్గాలలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు భారీ మోజార్టీతో గెలిచి ప్రభుత్వంలో ఉన్నారు.

జనంలో కనిపించని బీఆర్ఎస్ అభ్యర్థి..

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన క్యామ మల్లేష్‌ను అభ్యర్థిగా ప్రకటించి 20 రోజులకు పైగా గడిచింది. నామినేషన్ల గడువు కూడా మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయినప్పటికీ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సమావేశాలకు తప్ప మరెక్కడా కూడా ఆయన కనిపించిన దాఖలాలు లేవు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్ప కనీసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సెకండ్ క్యాడర్ ఆ స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా కలిసి మాట్లాడే పరిస్థితి లేదని ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.

అందుకే ఈ రెండు మూడు రోజుల్లోనే మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ జెడ్పీటీసీ ఇతర ప్రజాపతి నిధులు, మంత్రి జగదీశ్ రెడ్డి సొంత మండలం అయిన నాగారం జెడ్పీటీసీ కాంగ్రెస్‌లో చేరడం, ఇతర పార్టీలకి మారడం వారి అసంతృప్తిని తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే పార్టీ నేతలపై అనేక అవినీతి ఆరోపణలు, ఈ ప్రాంతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అసంతృప్తిగా ఉండడం, పేదలకు అందజేస్తామన్న కనీస సౌకర్యాలు పూర్తి చేయకపోవడంతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో కనీసం మండల స్థాయిలో కూడా ప్రచారం చేయకపోతే ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల ఓట్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో నేతలు ఉంటే డిపాజిట్ కూడా దక్కడం కష్టమేనని క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ చర్చించుకుంటున్నారు

అంతట అసంతృప్తే..

భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతంలో ఆయనకు ఎలాంటి పరిచయాలు సంబంధమూ లేదు. కేవలం నియోజకవర్గం ఆయనకు కలిసి వచ్చిన అంశం. అందుకే నియోజకవర్గంలో సొంత పార్టీలోనే అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌కు పార్టీ టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు అంతా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఉన్న అసంతృప్తి కారణంగా ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కూడా వాళ్లంతా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక్కడ గ్రూప్ తగాదాలే పార్టీకి తీవ్రంగా నష్టం చేసిన అవకాశం ఉన్న విషయం బహిరంగరాస్యమే.

భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన చెబితే కార్యకర్తలు వినే పరిస్థితి లేదు. ప్రచారాన్ని భుజాలపై వేసుకుని పని చేసే నాయకుడు కూడా ఆ నియోజకవర్గంలో లేరని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. జనగాం నియోజకవర్గంలో ఇప్పటికే తమ నియోజకవర్గానికి సంబంధంలేని పల్లా రాజేశ్వర్ రెడ్డిని మోస్తున్నాం.. ఇతర ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని తమ భుజాలపై మోయడం ఇష్టం లేదని అక్కడి కార్యకర్తలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అవసరమైతే పార్టీ మారిందుకైనా సిద్ధమని సంకేతాలిస్తున్నట్లు సమాచారం. ఇలా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగంగానే వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఆయనకు ఓట్లు రావడమే కష్టంగా ఉందని సొంత పార్టీకి చెందిన నేతలే చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed