బుద్ధ వనాన్ని సందర్శించిన భూటాన్ పోలీస్ అధికారులు

by Shiva |
బుద్ధ వనాన్ని సందర్శించిన భూటాన్ పోలీస్ అధికారులు
X

నాగార్జున సాగర్, సెప్టెంబర్ 21: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్‌లో నిర్మించిన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ బుద్ధ వనాన్ని భూటాన్ దేశ పోలీసు అధికారుల బృందం శనివారం సందర్శించారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, బుద్ధవనం ప్రత్యేక అధికారి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. భూటాన్ పోలీసు శాఖ డిప్యూటీ చీఫ్ (ఫైనాన్స్) వాంగ్ చుక్లా, పోలీసు ఉన్నతాధికారి ఉగ్వేన్ రిక్ జిన్ నేతృత్వంలో ఆరుగురు పోలీసు అధికారుల బృందం బుద్ధ వనాన్ని సందర్శించారు. వారు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకుని బుద్ధవనం సందర్శనకు వచ్చారు.

మహా స్థూపం చుట్టూ ఉన్న బౌద్ధ శిల్పాలను, లోపల ఉన్న బుద్ధదాతు పేటికలను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతకు, ప్రపంచ శాంతికి బుద్ధ వనం, మహాస్థూప సందర్శన చక్కటి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పర్యటన తమకు ఎంతో తృప్తినిచ్చిందని, బుద్ధుని బోధనలు, బౌద్ధ వాస్తు శిల్ప సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకునే అవకాశం దక్కిందని భూటాన్ పోలీస్ అధికారుల బృందం తెలిపింది. అంతకు ముందు ఆ బృందం నాగార్జున కొండ మ్యూజియంను సందర్శించి అక్కడ పునర్నిర్మితమైన మహా స్థూపాన్ని , సింహళ విహారాన్ని వీక్షించారు. భూటాన్ పోలీస్ బృందానికి బుద్ధవనం, నాగార్జునకొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చారిత్రక వివరాలను పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ వివరించారు.

Next Story

Most Viewed