- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో నీలి జెండా ఎగరేస్తామనే నమ్మకం ఉంది: ఎంపీ

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో నీలి జెండా ఎగురవేస్తామని నమ్మకం ఉందని బీఎస్పీ రాజ్యసభ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రాంజీ గౌతమ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఎస్పీ టాప్ గేర్‌లో పనిచేయాలని ఆదేశించారు. ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదలకు పాలనాధికారం ఇవ్వడానికి, పేదలకు గొంతుగా ప్రశ్నించడానికి బీఎస్పీ పోరాడుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యతిరేక పాలన సాగుతోందని మండిపడ్డారు. అందుకే భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం న్యాయం వంటి హక్కులను కాపాడాలని, ఆధిపత్య పార్టీల నాయకులను ఓడించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో బీఎస్పీ బలోపేతాన్ని చూసి అన్ని పార్టీలు భయపడుతున్నాయన్నారు. వచ్చే నెలలో వారం రోజుల పాటు తెలంగాణలో ఉండి పలు జిల్లాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు దయానందరావు, జనరల్ సెక్రటరీ అనితా రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరించి, హైదరాబాద్ జిల్లా మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.