కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు పేదలకు పంచుతాం: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-01 11:44:50.0  )
కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లు పేదలకు పంచుతాం: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్/ మహబూబ్ నగర్ బ్యూరో/కల్వకుర్తి: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజల కలలన్నీ నిర్వీర్యం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తాను రాజుగా భావిస్తున్నారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి. యుద్ధం మొదలైంది. ఇది దొరలు, ప్రజల మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. బుధవారం కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దొరల ప్రభుత్వంలో ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులకు నష్టం కలిగించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ఒక పార్టీ నేతలకు మాత్రమే ప్రయోజనం జరిగితే నష్టం మాత్రం తెలంగాణ ప్రజలందరికీ జరిగిందన్నారు.

అందుకే కేసీఆర్‌ను తెలంగాణలో ఓడించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని.. తొలుత కేసీఆర్ పదవికి బైబై చెప్పి ఆ తర్వాత అతను దోచుకున్న డబ్బులను రాబట్టాలన్నారు. కేసీఆర్ దొచుకున్నదంతా వసూలు చేసి ప్రజలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అందించబోతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకుంటూ చివరకు లక్ష కోట్ల వరకు ఈ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అదంతా పేదల సొమ్మే. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పిల్లర్లన్నీ ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. లక్ష కోట్ల ధనాన్ని దొంగతనం చేసినా ప్రాజెక్టుు మాత్రం సక్రమంగా నిర్మించలేకపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించిందని అవి ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయని వాటి ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తామన్నారు.

రైతు కుటుంబానికి రాహుల్ పరామర్శ:

అంతకు ముందు కల్వకుర్తి నియోజకవర్గం జిల్లెల్ల తండాకు చెందిన చంద్రయ్య అనే రైతు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న చంద్రయ్య అప్పుల బాధతో మూడేళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇవాళ కల్వకుర్తి సభకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర నేతలతో కలిసి రాహుల్ గాంధీ జిల్లెల్ల తండాకు వెళ్లి చంద్రయ్య కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రయ్య కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వారి పొలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తిగా గడ్డి పెరిగిన తమ భూమిని చంద్రయ్య భార్య తిరుపతవ్వ రాహుల్‌కు చూపించి బోరు లేక సాగు చేయలేకపోతున్నామని తమ సమస్యను వివరించారు. దీంతో పొలాన్ని సాగుకు ఉపయోగపడేలా మార్చాలని కసిరెడ్డి నారాయణరెడ్డికి రాహుల్ సూచించారు. పొలంలో బోరు వేయించే బాధ్యత తాను తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed