‘బండి’ అరెస్టుపై మోడీ సీరియస్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-06 02:10:30.0  )
‘బండి’ అరెస్టుపై మోడీ సీరియస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌‌గా తీసుకున్నది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు రోజు జరిగిన ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. మరో మూడు రోజుల్లో పర్యటన ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ అరెస్టుపై సమీక్షించారు.

ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను వెల్లడించడానికి అమిత్ షా, నడ్డా నిరాకరించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. కానీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేసి సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ప్రధానితో మీటింగ్ ముగిసిన వెంటనే అమిత్ షా, జేపీ నడ్డా విడిగా సమావేశమై ఇకపైన చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకున్నారు.

దానికి తగినట్లుగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. అరెస్టు అనంతరం పరిణామాలపై నగరంలోనే ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. బీజేపీ లీగల్ సెల్ బాధ్యుడైన మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావుకు ఫోన్ చేసిన జేపీ నడ్డా పలు చట్టపరమైన అంశాలపై ఆరా తీశారు. కేంద్ర నాయకత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూనే శ్రేణులతో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై సూచనలు చేశారు.

ఈ అరెస్టు దేనికి సంకేతం?

పార్టీ ‘ఫౌండేషన్ డే’ను ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా స్టేట్ యూనిట్ చీఫ్‌ను అరెస్టు చేయడంపై జాతీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఎవరిని ఉద్దేశించి ఈ అరెస్టు చేసినట్లు అనే చర్చ ఢిల్లీ స్థాయిలో మొదలైంది. ప్రధాని టూర్‌కు మూడు రోజుల ముందు బండి సంజయ్‌ను అరెస్టు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏం సందేశాన్ని పంపించాలని భావిస్తున్నదనే చర్చలు జరుగుతున్నాయి. పరోక్షంగా మోడీని హెచ్చరించడమే అనే అభిప్రాయమూ కొద్దిమంది బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నది.

ప్రధాని మోడీ పాల్గొనే టూర్‌లో ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ లేకుండా చేయడం నేరుగా ప్రధానిని టార్గెట్ చేసి అవమానించడమేననే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం అని పదేపదే విమర్శిస్తున్న బీజేపీ తాజా పరిణామంతో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బీఎల్ సంతోష్ సైతం బండి సంజయ్ అరెస్టుపై సంచలన కామెంట్లతో ట్వీట్ చేశారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు మునిగిపోయే నావ అంటూ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్‌ను అరెస్టు చేయడాన్ని కీలకమైన నరాన్ని పట్టుకోవడమే అంటూ ట్వీట్‌ ద్వారా స్పందించారు. బీఆర్ఎస్ రాజకీయ అసిత్వానికి ఇది చివరి పరిణామం అవుతుందని హెచ్చరించారు. టచ్ చేయకూడని వ్యక్తిని బీఆర్ఎస్ టచ్ చేసిందనే పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంతో బీజేపీ ఇక ఎంతమాత్రం సైలెంట్‌గా ఉండబోదనే పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్లయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ సైతం తెలంగాణ బీజేపీ నాయకులతో మాట్లాడి శ్రేణులకు తగిన కార్యాచరణను నిర్దేశించాలని సూచనలు చేశారు.

రియాక్షన్‌పై ఉత్కంఠ

రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ తదుపరి ఎలాంటి అడుగు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పాలనకు ఇవే చివరి రోజులని, ఇక ఆ పార్టీ ఇంటికి వెళ్లడమేనని ఇంతకాలం వ్యాఖ్యానించిన బీజేపీ ఇప్పుడు పొలిటికల్‌గా ఎలాంటి కౌంటర్ స్టెప్ తీసుకుంటుందనే చర్చలు మొదలయ్యాయి. స్టేట్ ప్రెసిడెంట్‌ను అరెస్టు చేసిన తర్వాత దానికి తగిన తీరులో స్పందించకుంటే ప్రజల్లో పార్టీ పలచన అవుతుందని, అధికారంలోకి వచ్చే సంగతేమోగానీ కేడర్‌ను ఉత్సాహంగా ఉంచలేమనే అభిప్రాయాలూ ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర నాయకత్వం స్టేట్ లీడర్‌ షిప్‌ను ఎలా డ్రైవ్ చేస్తుందనేది ఆ పార్టీలోనే కాక విపక్షాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారిన ఈ ఇష్యూ రానున్న కాలంలో ఏ దిశగా వెళ్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని రాకకు ముందు జరిగిన ఈ పరిణామాలు ఇప్పుడు బీజేపీకి ‘ఇజ్జత్ కా సవాల్’ తరహా వంటిదని, ఆ పార్టీ నుంచి ఎలాంటి వ్యూహం అమల్లోకి వస్తుందనేది ఉత్కంఠగా మారింది.

స్వయంగా మోడీ, అమిత్ షా, నడ్డా రంగంలోకి దిగే అవకాశాలపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్టేట్ చీఫ్‌గా లేకపోవడంపై ఎలా స్పందిస్తారనేది ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అనేక బహిరంగసభల్లో ఆయనను వ్యక్తిగతంగా హీరోగా అభివర్ణించిన పరిస్థితుల్లో ఇప్పుడు జైల్లో ఉండడాన్ని ఎలా జీర్ణించుకుంటారనేది పరేడ్ గ్రౌండ్స్ సభలో ఆయన చేసే ప్రసంగంలో ప్రస్తావించే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

లోక్‌సభ స్పీకర్‌కు ప్రివిలెజ్ నోటీసు

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను అరెస్టు చేసిన వ్యవహారం బీజేపీ ఎంపీల మధ్య ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చొరవ మేరకు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ లోక్‌సభ స్పీకర్‌కు మెమొరాండం సమర్పించారు. ఎంపీల ప్రివిలెజెస్‌కు తెలంగాణ పోలీసులు భంగం కలిగించారని అందులో పేర్కొన్నారు.

లోక్‌సభ నిబంధనలు రూల్ 229 ప్రకారం ఎంపీని అరెస్టు చేసే ముందు స్పీకర్‌కు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, అప్రజాస్వామికంగా వ్యవహరించడం మాత్రమే కాక ఎంపీ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆ మెమొరాండంలో కోరారు. ప్రివిలెజ్ కమిటీ దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి బాధ్యులైనవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పార్లమెంటులో బీజేపీ ఎంపీల నిరసన

బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్య అంటూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాలకు అతీతంగా పలువురు బీజేపీ ఎంపీలు బండి సంజయ్ అరెస్టును ఖండించి తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఎంపీలు లక్ష్మణ్, జీవీఎల్ నర్సింహారావు, సోయం బాపూరావ్ తదితరులు పార్లమెంటులోనే ప్రొటెస్ట్ చేశారు. ఈ విషయం ప్రధాని దృష్టికి కూడా వెళ్లింది.

Read more:

ఏడాది కాలంగా ‘బండి’ అరెస్టులు

రెండు సీట్ల నుంచి 303 స్థానాల వరకు...ఎదురులేని భారతీయ జనతా పార్టీ

Advertisement

Next Story

Most Viewed