మంత్రి జూపల్లి కృష్ణారావుకు MLC కవిత లేఖ

by Gantepaka Srikanth |
మంత్రి జూపల్లి కృష్ణారావుకు MLC కవిత లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శనివారం కవిత లేఖ రాశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కూడలిలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని కోరారు. దాశరథి జన్మించిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న దాశరథి గ్రంథాలయానికి ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని సూచించారు.

దాశరథి సమగ్ర సాహిత్యాన్ని ప్రభుత్వమే ముద్రించి గ్రంథాలయంలో ఉంచడంతో పాటు అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు. దాశరథి శతజయంతిని ఘనంగా నిర్వహించడం ప్రభుత్వ విద్యుక్త ధర్మమన్నారు. అధికారికంగా ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ, ఆ దిశగా ఏ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకోలేదని విమర్శించారు. దాశరథిని కారాగారంలో ఉంచిన నిజామాబాద్ జిల్లాలోని పాత జైలులో మరమ్మత్తులు చేసి, పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని కోరారు.

Next Story

Most Viewed