బీఆర్ఎస్ పాపాలన్నీ బయటపెడతా.. MLA వేముల వీరేశం కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
బీఆర్ఎస్ పాపాలన్నీ బయటపెడతా.. MLA వేముల వీరేశం కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మీ దాంట్లోనే ఉన్నా... మీ పాపాలు అన్నీ చెబుతా.. వినే ఓపిక ఉందా.. మనిషిగా చూడలేని మిమ్ములను వదిలిపెట్టి.. ఆదరించే కాంగ్రెస్‌కు వచ్చాను.. అవమానించబడ్డ మీ కాడి నుంచి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చా.. నన్ను గెలకొద్దు.. మిమ్మల్ని గెలికించుకోవద్దు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో శుక్రవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణంపై మాట్లాడారు. అధికారం ఉన్నది హద్దుపద్దుల్లేక.. అన్యాయ మార్గాలను ఆర్జింప జూసినా.. అచ్చివచ్చే రోజులు అంతమైనాయి.. అని కాళోజీ వ్యాఖ్యలతో ప్రసంగం ప్రారంభించారు. ప్రజలకు ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన ప్రారంభమైందన్నారు. దళితబంధు పేరుతో దళితులను మభ్యపెట్టారన్నారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందన్నారు. అధికారంలో ఉన్నామని గర్వం ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్ ప్రజలకు దూరమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి గోడలు బద్దలు కొట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వం అన్నారు. గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన కొనసాగిందన్నారు.

రెండు నెలల్లో... 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ప్రభుత్వ భవనాలుకాదని మండిపడ్డారు. ప్రజల విశ్వసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వమన్నారు. కృష్ణా, గోదావరి నీరు నకిరేకల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలకు రావడం లేదన్నారు. మిషన్ భగీరథలో 7వేలకోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్దారణకు వచ్చిందని, ఈ పథకంతో ఏ నియోజకవర్గానికి నీరు రావడంలేదన్నారు. దక్షిణ తెలంగాణలో గత ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పదేళ్లలో పూర్తి చేయలేదని, ఎడారి చేశారని మండిపడ్డారు. నాట్లు వేసుకున్న రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పాలమూరు ప్రజలు బీఆర్ఎస్‌ను దూరం పెట్టారని, ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. ఐదేళ్లలో నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదన్నారు. విద్య, వైద్యరంగాన్ని ధ్వంసం చేశారన్నారు. ఉద్యమకారులంటే బీఆర్ఎస్‌కు గౌరవం లేదన్నారు. గద్దర్‌ను ఘోరంగా అవమానించారన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని, వాటిల్లో 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి.. ప్రైవేటు వర్సిటీలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారన్నారు. ఉద్యోగాల నియామకాల్లో ఎన్నో అవకతవకలు చేశారని, పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. గవర్నర్ హుందాగా మాట్లాడారని, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే స్వేచ్ఛ వచ్చిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed