రూ.2 లక్షల రుణమాఫీలో కండీషన్స్ ఎందుకు..? MLA మహేశ్వర్ రెడ్డి

by Satheesh |
రూ.2 లక్షల రుణమాఫీలో కండీషన్స్ ఎందుకు..? MLA మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి కండీషన్స్ లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే రుణమాఫీ మార్గదర్శకాల్లో రేషన్ కార్డు ఉన్న రైతులకే ఇస్తమనే కండీషన్‌తో పాటు కాంగ్రెస్ మరికొన్ని కండీషన్లను పెట్టిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఎలాంటి కండీషన్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇన్ని కండీషన్స్ ఎందుకు పెట్టినట్లని ఆయన ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అనడంపై ఆయన ధ్వజమెత్తారు. చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు చేశారని, బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలవుతారని ఆయన పేర్కొన్నారు.

రుణమాఫీ మార్గదర్శకాల్లో కూడా రీషెడ్యూల్ అయిన వారికి వర్తించదని ఉండటంతో ఎంతో మందికి నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి చాలా మందికి మాఫీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏలేటి విరుచుకుపడ్డారు. గతంలో ఒకే రేషన్ కార్డులో ఉన్న ఎంతోమంది అన్నదమ్ములు వేరుపడ్డారని, భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటని ఏలేటి ప్రశ్నించారు. ఒక్క రేషన్ కార్డులో నలుగురిపై లోన్ ఉంటే ఈ నిబంధనల ప్రకారం ఒక్కరికే వస్తుందని, మిగతా వారు నష్టపోతారని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఒక్కరికి చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని, ఇలాంటి కండీషన్ పెట్టడం సరైన పద్ధతి కాదని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి కండీషన్ లేకుండా రుణమాఫీ చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారని, సర్పంచుల బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఒక్కరోజు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు మంత్రుల కంపెనీలకు రూ.వందలు, వేల కోట్లు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి వార్డ్ మెంబర్లతో సహా అందరికీ వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, గ్రామీణ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉంటే పల్లెబాట పట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపైనా ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతమని చెప్పిన కడియంను చేర్చుకున్నారని ఆయన చురకలంటించారు. రేవంత్ కావాలనే కడియంతో ఈ మాట అనిపించి అపవాదు వేయించి చివరకు కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ను కూలగొడతామని చెప్పిన వారికి చావు డప్పులని విమర్శలు చేసి ఇప్పుడు చేర్చుకుని సమర్థించుకోవడం రేవంత్‌కే చెల్లిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చురకలంటించారు.



Next Story