ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం: Etela Rajender

by Satheesh |   ( Updated:2023-08-08 09:34:35.0  )
ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం: Etela Rajender
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, పెద్దల కోసమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేస్తున్నారన్నారు. మరోవైపు ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు. భూములు అమ్మవద్దని నాడు అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకోని ఆందోళన చేశాం.. నేడు భుములు ఎలా అమ్ముతున్నారు? అని నిలదీశారు.

చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు మొత్తం 14 రోజులు మాత్రమే జరిగాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు జరిగేవని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళుగా.. పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్ళుగా మార్చారని విమర్శించారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవని, అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారని గుర్తుచేశారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి బీఏసీ సమావేశానికి పిలువలేదని మండిపడ్డారు. బీజేపీ సభ్యులకు అసెంబ్లీలో ఒక్క రూం కేటాయించాలని వేడుకున్నా.. పట్టించుకోలేదని ఆగ్రహించారు.

కాగ్ రిపోర్ట్‌పై కామెంట్స్

సభ సజావుగా సాగిందని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. స్పీకర్ తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ప్రతిపక్ష పార్టీ ఎంఐఎంను పొగడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. మూడు రోజులు సభ జరిగిందని, ఒకరోజు హరీష్ రావు, రెండో రోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్ ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు.

కాగ్ రిపోర్ట్‌పై ఈటల స్పందిస్తూ బడ్జెట్ పెరుగుతుందని, కానీ కేటాయింపులు తగ్గుతున్నాయని అన్నారు. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదని నిలదీశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు. ప్రభుత్వ ఖర్చులలో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుందని, నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకే పోతుందని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed

    null