‘సీఎంవో’ ప్రక్షాళన.. మినిస్టర్ల అసంతృప్తికి రీజన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-21 02:13:53.0  )
‘సీఎంవో’ ప్రక్షాళన.. మినిస్టర్ల అసంతృప్తికి రీజన్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంఓ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తున్నది. కొందరు సెక్రటరీలు అత్యవసర ఫైళ్ల విషయంలోనూ కావాలనే జాప్యం చేస్తున్నారని సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. బదిలీలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం.. సరిగా పనిచేయని ఆఫీసర్లను తప్పించి, సమర్థులను అపాయింట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న ఆఫీసర్లను తప్పించడమో, లేకపోతే వారి వద్ద ఉన్న శాఖల్లో మార్పుల, చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సీఎంఓలోని కొందరు సెక్రటరీల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒక కొర్రీ వేస్తూ, ఫైళ్లను వెనక్కి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరమైన ఫైళ్లపై కూడా సంతకం చేయడం లేదని, చివరికి సీఎం దృష్టికి తీసుకెళ్తే తప్పా ఫైల్స్ క్లియర్ కావడం లేదని తెలుస్తున్నది. సీఎంఓ, శాఖల సెక్రటరీల మధ్య సమన్వయం లేకపోవడంతో, ఆ ప్రభావం పాలనా అంశాలపై పడుతున్నట్టు సమాచారం. దీంతో సీఎంఓలోని సంబంధిత సెక్రటరీలను తప్పిస్తారా? లేక వారి వద్ద నుంచి శాఖలను తొలగిస్తారా? అనే చర్చ జరుగుతున్నది.

మంత్రుల పెదవి విరుపు

సీఎంఓలో పనిచేసే అధికారులు వివిధ శాఖల సెక్రటరీలతో సమన్వయం చేసుకుంటూ, సీఎంకు బ్యాక్ బోన్ గా వ్యవహరించాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పాలనలో భాగస్వామ్యం కావాలి. కానీ సీఎంఓలోని కొందరు అధికారులు సరిగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారుల వ్యవహారశైలిపై సీనియర్ మంత్రులు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసినా సరిగా రెస్పాండ్ కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కొందరు సీఎం సెక్రటరీల అలసత్వం వల్ల పలు కీలకమైన ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని ఆగ్రహంతో సదరు మంత్రులు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సదరు ఆఫీసర్లపై ఏం చర్యలు తీసుకుంటారోననే ఆసక్తి నెలకొన్నది.

ఏరికోరి ఎంపిక

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం కొన్ని వర్గాల ఆఫీసర్లకు మాత్రం సీఎంఓలో చోటు దక్కింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీల అపాయింట్మెంట్ విషయంలో సామాజిక న్యాయం పాటించేలా.. అన్ని వర్గాల ఆఫీసర్లకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ కొందరు ఆఫీసర్ల పనితీరు సీఎంకు చెడ్డపేరు తెచ్చేవిధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. అనవసర విషయాలను భూతద్దంలో చూస్తూ, కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు సీఎంఓ సెక్రటరీలకు ఒక శాఖ కింద ఏఏ విభాగాలు ఉంటాయో తెలియకపోవడంతో, ఓ మంత్రి పేషీకి పంపాల్సిన ఫైల్ మరో పేషీకి పంపిన సంఘటనలు సైతం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.

జూనియర్, సీనియర్ల పంచాయితీ

వివిధ శాఖల్లో పనిచేసే ఐఏఎస్ ల కంటే సీఎంఓలో పనిచేసే సెక్రటరీల్లో ఎక్కువ మంది జూనియర్లు ఉన్నారు. దీంతో ఇరువురి మధ్య ఇగో పంచాయితీలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తమ వద్దకు వచ్చిన ఫైల్ పై సీఎంతో సంతకం చేయించకుండా కొందరు సీఎంఓ సెక్రటరీలు కొర్రీలు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్లే సదరు సీఎం సెక్రటరీలు ఇలా వ్యవహరిస్తున్నారని సీనియర్ ఐఏఎస్ లు చెబుతున్నారు. మరోవైపు సీఎంఓలో ఎక్కువ మంది సెక్రటరీలు నాన్- ఐఏఎస్ లు ఉన్నారు. దీంతో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియని వాళ్లకు బాధ్యతలు ఇవ్వడంపై ఐఏఎస్ లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

ఐఏఎస్ లతోపాటు పాటు సీఎంఓ ప్రక్షాళన?

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని భావిస్తున్నారు. సరిగా పనిచేయని ఆఫీసర్లను తప్పించి, సమర్థులను అపాయింట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర పాలనలో కీలకమైన హోదాలో ఉన్న అధికారుల వ్యవహారశైలిపై ఫిర్యాదులు రావడంతో, వారిని కూడా తప్పించే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సదరు ఆఫీసర్ ను తప్పిస్తే, కొత్తగా ఆ హోదాలో ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్టు టాక్ ఉంది. అదే సమయంలో సీఎంఓలో పనితీరు సరిగా లేని కొందరు అధికారులను పక్కన పెట్టే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న ఆఫీసర్లను తప్పించడమో, లేకపోతే వారి వద్ద ఉన్న శాఖల్లో మార్పుల, చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed