కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది: మంత్రి ఉత్తమ్

by GSrikanth |
కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది: మంత్రి ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసే చివరి రోజున కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అసెంబ్లీకి వెళ్ళి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరగనున్నందున ఇద్దరి గెలుపూ ఖాయం. అసెంబ్లీలో సంఖ్యబలం రీత్యా వీరిద్దరూ గెలవనున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌కు తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రెండు స్థానాలకు ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి లాంఛనంగా ప్రకటించనున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు :

ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందినవారు కాగా మరొకరు అగ్రవర్ణానికి చెందినవారు. నామినేషన్ల గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు (మధ్యాహ్నం పన్నెండు గంటలకు) ఇద్దరూ అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్ళి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వివేక్ తదితరులు ఉన్నారు. పార్టీ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు స్థానాలకు ఇద్దరే నామినేషన్లు వేయడంతో పోటీ లేకుండా పోయింది. ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నందుకు వారిద్దరికీ పార్టీ నేతలు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

కష్టపడేవారిని పార్టీ గుర్తిస్తుంది : మంత్రి ఉత్తమ్

పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణ బల్మూరి వెంకట్ అని గుర్తుచేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమాల్లో బల్మూరి వెంకట్, పార్టీ యాక్టివిటీస్‌లో మహేశ్‌కుమార్ గౌడ్ చురుగ్గా పాల్గొన్నారని నొక్కిచెప్పారు. వారి సేవలను గుర్తించిన పార్టీ.. తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిందన్నారు. రెండు స్థానాలకు ఇద్దరే నామినేషన్లు వేయడంతో ఇక వారి ఎన్నిక ఏకగ్రీవమని, ప్రకటన లాంఛనమేనని అన్నారు. సర్పంచ్‌లు బిల్లుల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి పాత్రికేయులు ప్రస్తావించగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా చివరకు సర్పంచ్‌లు బాధితులుగా మిగిలారని అన్నారు. అదే పార్టీ ఇప్పుడు వారి తరఫున పోరాడుతామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఇంతకాలం బిల్లులు ఎందుకు చెల్లించలేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed