Minister Uttam: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు KCR సహకరించారు

by Gantepaka Srikanth |
Minister Uttam: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు KCR సహకరించారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చుక్క నీరు కూడా వెళ్లలేదని.. తమ ప్రభుత్వం పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నదని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హరీశ్‌రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఉత్తమ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నదని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. గోదావరి-బనకచెర్ల అనుసంధాన పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేవలం ప్రతిపాదన మాత్రమే సమర్పించారని.. హరీశ్‌రావు తన ఊహల్లో ఇప్పటికే 200 టీఎంసీల నీటిని మళ్లించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు ఇవ్వద్దని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతిపాదిత గోదావరి-బనకచెర్ల లిఫ్ట్ స్కీమ్ 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డును, 2014 నాటి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు.

నిర్మాణానికి అనుమతులు తప్పనిసరి..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ప్రకారం పోలవరం వద్ద గోదావరి నది నుండి 200 టీఎంసీల వరదనీటిని బొల్లాపల్లి రిజర్వాయర్, బానకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఉత్తమ్ తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఏపీ కేంద్ర గ్రాంట్లను కోరుతున్నట్లు చెప్పారు. అయితే.. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (జీఆర్‌ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్‌ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి బేసిన్‌లోని మిగులు జలాలపై ఆధారపడి ఉందని, అవి తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా కేటాయింపులు కాలేదని తెలిపారు. ఈ పథకం నిర్మాణం చేపడితే తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు కీలకమైన నీటి వనరులను దూరం అవుతాయని లేఖలో పేర్కొన్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఏపీ ముందుకు వెళ్లకుండా, ఆర్థిక సహాయం అందించకుండా చూడాలని ఆయన మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్ట్‌ను పూర్తిగా రద్దు చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే ఉంటుందని, నీటి హక్కులు, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు కేసీఆర్ మద్దతు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని మంత్రి విమర్శించారు. 2015లో 299 టీఎంసీల తక్కువ కృష్ణా నీటి కేటాయింపునకు అంగీకరించడం వారి పేలవమైన పాలనకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అదనంగా రూ.లక్ష కోట్లతో పేలవంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారని.. ఇది ఖరీదైన ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్‌ఎల్‌ఐఎస్) నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సహకరించారని ఆయన ఆరోపించారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోకపోవడంతో ఆర్‌ఎల్‌ఐఎస్‌లో ఏపీ పనులు ప్రారంభించిందన్నారు.

Next Story

Most Viewed