Sridhar Babu: మూసీపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. డబ్బులిచ్చి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు: శ్రీధర్ బాబు

by Prasad Jukanti |
Sridhar Babu: మూసీపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. డబ్బులిచ్చి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు: శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైడ్రా, మూసీ విషయంలో ఎటువంటి అనుమానాలు, అభద్రత భావం పెట్టుకోవద్దని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చట్టబద్దంగా, ప్రణాళిక యుతంగా మూసీ, హైడ్రా పైన ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూసీ నిర్వాసితులు ఆందోళన పడవద్దని నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. నిర్వాసితులకు ఇండ్లతో పాటు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని, ప్రభుత్వ పథకాల్లో మూసీ నిర్వాసితులకు ప్రయార్టీ ఇస్తామన్నారు. మూసీ, హైడ్రా విషయంలో అనుమానాలు ఉంటే అన్ని కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తామన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ప్రతిపక్షాలు చిన్న చిన్న అంశాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నిర్వాసితులందరిని కడుపులో పెట్టుకొని చూస్తామన్నారు. రివర్ బెడ్ గుర్తించే నివాసాలకు కూడా భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం చెల్లిస్తామన్నారు.

బీఆర్ఎస్ మొసలి కన్నీరు:

మూసీ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి విమర్శించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు. మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకొని ఆహుతయ్యాడని గుర్తు చేశారు. 2013 భూనిర్వాసితుల చట్టాన్ని అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చిందని. మల్లన్న సాగర్ భూనిర్వాసితులు విషయంలో హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసిన సంగతి మరువద్దన్నారు. భూనిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే గులాబీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బులిచ్చి ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఇది రాజకీయం కాదని హెచ్చరించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపైకి, రైతు సోదరులపైకి బుల్డోజర్ లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. మా హస్తం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం మా దామోదర రాజనర్సింహ పోరాటం చేశారన్నారు. మీ పాలనలో రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ ను మల్లన్న సాగర్ వైపు రాన్విలేదు. కానీప్రజా పాలనలో ప్రతిపక్షం ఎక్కడికైనా వెళ్లినా అనుమతులు ఇస్తున్నామన్నారు.

హైడ్రా బాధితుల విషయంలో సీఎం ఆలోచన:

బిల్డర్ల చేతిలో మోసపోయిన పేదలు, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడదని శ్రీధర్ బాబు అన్నారు. ఎవరూ ఆందోళన పడవద్దని ఎవరికీ అన్యాయం జరగకూడదని ప్రభుత్వం నమ్ముతోందన్నారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి.. అపార్ట్ మెంట్ నిర్వాసితులకు ఏ రకంగా న్యాయం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. బిల్డర్ల చేతిలో మోసపోయిన వారి విషయంలో మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పి చేయకపోగా మా ప్రభుత్వం చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చిందన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా మూసీ ప్రక్షాళన ఉండబోతున్నదని మంత్రి చెప్పారు. ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణం, లింకు రోడ్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మూసీపై ప్లై ఓవర్లు నిర్మిస్తామని పీపీపీ మోడల్ లో నిర్మాణాలు ఉంటాయన్నారు. మూసీ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశామని పాదర్శకంగా పనులుంటాయని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న సంస్థలనే ఆహ్వానిస్తున్నామన్నారు.

Advertisement

Next Story