బీఆర్ఎస్ నేతలు తెల్ల మొహాలు వేయడానికి కారణమిదే: మంత్రి శ్రీధర్ బాబు

by GSrikanth |
బీఆర్ఎస్ నేతలు తెల్ల మొహాలు వేయడానికి కారణమిదే: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల అప్పులపై బీఆర్ఎస్ నేతల్లో సమాధానాలు లేవని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడుతూ.. చేసిన అప్పులపై వివరణ ఇవ్వలేక బీఆర్ఎస్ నేతలు తెల్ల మొహాలు వేశారన్నారు. ప్రతిపక్షాలను క్రిటిసైజ్ చేయడం తమకు అలవాటు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామన్నారు. గత పదేళ్ళలో బీఆర్ఎస్ పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శ్వేతపత్రాలు నిజమే అని అప్పులు చేసినం, చేసిన ఖర్చు వల్ల ప్రయోజనాలు లేవని స్వయంగా బీఆర్ఎస్ నేతలే ఒప్పుకున్నారన్నారు.

రాష్ట్రంలో ప్రతి యువకుడిపై రూ.7లక్షల అప్పును గత ప్రభుత్వం మోపిందన్నారు. రేషన్ బియ్యం పంపిణీ, రైతులకు మద్దతు ధర, విద్యా వ్యవస్థపై సమాధానాలు లేవన్నారు. మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై కూడా సమాధానం చెప్పలేక తెల్లమొహాలు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం.. కావాలంటే స్పీకర్ ఆదేశంతో ప్రతీ సభ్యుడికి అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్ వినియోగ దారులకు పూర్తి స్థాయిలో కరెంట్ ఇస్తామన్నారు.

Advertisement

Next Story