గద్దర్ పాటే మా పోరాటానికి దిక్సూచి : మంత్రి సీతక్క

by M.Rajitha |
గద్దర్ పాటే మా పోరాటానికి దిక్సూచి : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్: గద్దర్ అంటేనే పోరాటమని, ఆయన పాట నుండే తాము పోరాటంలోకి వచ్చామని స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం గద్దర్ ప్రధమ వర్ధంతి సభలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ.. ఎక్కడ కష్టముంటే అక్కడ గద్దర్ ఉంటారని, ఆయన పాడిన ప్రతిపాట మన అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. గద్దర్ పాటే తమ పోరాటానికి దిక్సూచని అభివర్ణించారు. ప్రజల కోసం ప్రజల తరఫున కోట్లాది ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారని గద్దర్ సేవలను కొనియాడారు. ఆయన లాంటి సాంస్కృతిక పోరాట వారధి వంటి యుద్ధ నౌక లేకపోవడం బాధాకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, రాహుల్ గాంధీ పాదయాత్రల్లో గద్దర్ తో కలిసి నడిచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ప్రతిపక్షంలో మాకు అండగా ఉండి మాకు సలహాలు సూచనలు ఇచ్చేవారని, అసెంబ్లీలో కాంగ్రెస్ కి అయిదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు.. గద్దర్ మాకు కొండంత అండగా నిలిచారని చెప్పారు. గద్దర్ భావజాలంతో అనుబంధం వున్న అందరిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన గద్దర్ కుటుంబ సభ్యులకు, గద్దర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. గద్దర్ సూచనలు సలహాలు పాటిస్తూ ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పని చేస్తామని సీతక్క తెలిపారు.



Next Story

Most Viewed