- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Seethakka: చిల్లర మాటలు బంద్ పెట్టు! బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. నిరుద్యోగులకు యువకులకు జవాబు చెప్పుకోలేక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారని, చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే నోరు తెరిస్తే హిందుస్థాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదన్నారు. సూటిగా అడుగుతున్నా.. పట్టభద్రులకు మీరేం చేశారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
పాకిస్తాన్‌తో పోల్చి కించపరచడం తప్ప ఏం చేశారు
ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారని, బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి భారత్ గొప్పతనాన్ని తగ్గించొద్దన్నారు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి అని సవాల్ చేశారు. ఆయనకు చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనాలని సూచించారు. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని అవమానపర్చకండి అంటూ ఆగ్రహించారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలని సూచించారు.
అధికారం కోసం విద్వేష ప్రసంగాలు అవసరమా?
అధికారం కోసం విద్వేష ప్రసంగాలు అవసరమా? అని సీతక్క ప్రశ్నించారు. భవద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండని యవతకు పిలుపునిచ్చారు. యువతనీ మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయమని ఆరోపించారు. టీఆర్ఎస్ బీజేపీ దొందూ దొందే అని విమర్శించారు. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలని, ఈ చిల్లర మాటలు మానేయండని హితువు పలికారు. ఇలాంటి విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. అన్ని రంగాల వెనుకబడ్డ పాకిస్తాన్‌తో భారత్‌ని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారని, అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని ఆరోపించారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. దేవునికి వినియోగించే అగర్బత్తిల మీద కూడా జీఎస్టీ వేసిందని గుర్తుకు చేశారు. ఉన్నత విద్య మీద 18% జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేనీ అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది అంటూ విమర్శలు గుప్పించారు.