మూసీకి సరికొత్త సోయ‌గాలు.. సియోల్ పర్యటనలో పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-21 08:02:10.0  )
మూసీకి సరికొత్త సోయ‌గాలు.. సియోల్ పర్యటనలో పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ , తెలంగాణ బ్యూరో: దక్షిణ కొరియా సియోల్ న‌గ‌రంలో చియోంగ్ గ‌యే చేయ‌న్ (హ‌న్ న‌ది)కి అక్క‌డి ప్ర‌భుత్వం పున‌రుజ్జీవం క‌ల్పించిన త‌ర‌హాలోనే మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేసి స‌రికొత్త సోయ‌గాల‌ను, ప్ర‌గ‌తి ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. మూసీ న‌ది పున‌రుజ్జీవ కార్య‌క్ర‌మంలో భాగంగా 12 మందితో కూడిన ప్ర‌త్యేక ప‌రిశీల‌నా బృందం ఆదివారం నుంచి సియోల్‌లో పర్యటించింది.

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి నేతృత్వంలో హ‌న్ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల‌ను స‌భ్యులు ప‌రిశీలించారు. అక్క‌డ ఒక‌ప్పుడు అత్యంత కాలుష్యంతో నిండి ప్ర‌జ‌లు జీవించ‌లేని పరిస్థితుల నుంచి పునరుజ్జీవంతో ఏవిధంగా నూత‌న క‌ళ‌ను సంత‌రించుకుంద‌న్న విష‌యంపై స‌మ‌గ్రంగా తెలుసుకున్నారు. హ‌న్ న‌ది ప‌రీవాహ‌క ప్రాంతాల‌లో బ‌డుగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు జీవ‌నం సాగించేవారు. ప్ర‌భుత్వం 2003 అక్టోబ‌ర్ 1న ఈ న‌దిని సంపూర్ణంగా , సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌తిపాదించింది. ఆమేర‌కు ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించగా ప్ర‌భుత్వం వారికి కొత్త జీవితం, జీవ‌నం ల‌భిస్తుంద‌ని ఒప్పించింది. ఫ‌లితంగా కేవ‌లం 2 ఏళ్ల‌లో అంటే 2005 అక్టోబ‌ర్ 1 నాటికి ప్రాజెక్ట్ పూర్త‌యింది. దీంతో గతంలో ఎన్న‌డూ చూడ‌ని కొత్త సొగ‌సులు చేకూర‌డ‌మేగాక వ్యాపారాలు విస్త‌రించాయి. ప్ర‌పంచ‌మే విస్తుపోయేలా భారీ క‌ట్ట‌డాలు, సుంద‌రీక‌ర‌ణ‌తో ప‌ర్యాట‌కం ప‌రుగులు తీసింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు న‌దీతీరంలో కుళ్లు, బురద‌, అపారిశుధ్యంతో విల‌విల్లాడిన నిర్వాసితులకు స‌రికొత్త లోకం ఆవిష్కృత‌మైంది. వారితోపాటు ప‌ర్యాట‌కులు కూడా వ‌చ్చి సుంద‌ర‌, ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed