Ponguleti: వారు చేతులెత్తేయడం వల్లే హెలికాప్టర్లు రాలే.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-09-02 15:07:52.0  )
Ponguleti: వారు చేతులెత్తేయడం వల్లే హెలికాప్టర్లు రాలే.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లను రప్పించలేకపోయారని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ల కోసం మేము ప్రయత్నించామని కానీ స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలు, మబ్బుల కారణంగా హెలికాప్టర్లను పంపించలేమని నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ వారు చేతులెత్తేశారని ఇందుకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ ప్రభుత్వం వద్ద ఉందన్నారు. హెలికాప్టర్లు తీసుకురావడం అంటే పొంగులేటి, తుమ్మల, భట్టి తలుచుకుంటే జరిగేది కాదని ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్లు రాలేకపోయాయన్నారు. చేతనైతే సాయం చేసి బాధితులను ఆదుకోవాలి తప్ప ఇలాంటి సమయంలో బురద రాజకీయం సరికాదన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పొంగులేటి.. ఈ సందర్భంగా ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే నీచ రాజకీయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. కొంత మంది నిర్లక్ష్యం వహించిన అధికారులూ ఉన్నారని వారి మీద చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వరదల కారణంగా కనీవినీ ఎరుగనంత నష్టం జరిగిందని, నా నియోజకవర్గంలోనే ఎక్కువ నష్టం సంభవించిందన్నారు. వరదల కారణంగా చాలా మంది బాధితులు నిరాశ్రయులుగా మారిపోయారని వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed