ఆ ఎనిమిది మంది చనిపోయారు.. ప్రకటించిన మంత్రి జూపల్లి

by Bhoopathi Nagaiah |
ఆ ఎనిమిది మంది చనిపోయారు.. ప్రకటించిన మంత్రి జూపల్లి
X

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లేనని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. శనివారం టన్నల్‌లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌పై అధికారులు, నిపుణులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం గత ఎనిమిది రోజులుగా 12 రిస్క్యూ టీములతో ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టామని తెలిపారు. ఆధునీక టెక్నాలజీతో సెర్చింగ్ చేయగా 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించామని ప్రకటించారు. ఆ ఎనిమిది మంది మరణించారని 99% చెప్పగలం.. ఒక్క శాతం మాత్రం చెప్పలేమని మంత్రి పేర్కొన్నారు.

నాలుగు మృతదేహాలు బురదలో మూడు ఫీట్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మిగిలిన నాలుగు మృతదేహాలు యంత్రం కింద ఉన్నట్లు తేలిందన్నారు. రేపటిలోగా నాలుగు మృతదేహాలను యంత్రాలతో కాకుండా మనుషులతో వెలికి తీస్తున్నామన్నారు. 24 గంటల్లో నాలుగు మృతదేహాలను బయటకు తీస్తామని, మిగిలిన నాలుగు మృతదేహాలను 450 నుండి 550 టన్నుల బరువు ఉన్న మిషన్ ను విడిభాగాలుగా కటింగ్ చేసి తర్వాత వెలికి తీసేందుకు రిస్క్యూ బృందాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ప్రమాదంలో కనిపించకుండగా పోయిన వారిని కనిపెట్టేందుకు ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా పనిచేశామని మంత్రి స్సష్టం చేశారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. రాజకీయాలు మాని నిజానిజాలు తెలుసుకొని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Next Story