బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ: హరీశ్ రావు

by GSrikanth |
బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ అంటే భారత జనులను పీడించే పార్టీ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నిక‌లు పూర్తయిన ప్రతిసారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనవాయితీగా మారిందని మండిపడ్డారు. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికలు అలా ముగిసాయో లేదో ఇలా మళ్లీ గ్యాస్ ధరలు పెంచాలని ధ్వజమెత్తారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయని ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ పెంచుతారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని, డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 చొప్పున ధరలు పెంచడం దారుణమైన చర్య అన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ పై 350 సబ్సిడీ ఉండేదని దాన్ని మోడీ వచ్చాక క్రమంగా తగ్గించి సున్నా చేశారని అన్నారు. నాడు గ్యాస్ ధర రూ.400 ఉంటే అప్పటి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేశారు. ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. గల్లీ మీటింగ్‌లకు వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలని అన్నారు.

Advertisement

Next Story