రేపే పల్స్ పోలియో

by Naresh |
రేపే పల్స్ పోలియో
X

దిశ, మేడ్చల్ బ్యూరో: పోలియో వ్యాధి నివారణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 3న ఆదివారం జిల్లాలోని ఐదేళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి అన్నారు. ఇది మూడు రోజుల పాటు కొనసాగిస్తామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సరస్వతి, డా. కౌశిక్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడురు. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రత్యేకమైన కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పిల్లలందరికీ ఒకే రోజు పోలియో చుక్కలు వేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అలాగే, ఈ కార్యక్రమం రెగ్యులర్ గా నిర్వహించే దానికి అదనమని కూడా డా. రఘునాథ స్వామి వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదే‌లలో పోలియో కేసులు వస్తున్నందున దీని నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కంకణం కట్టుకుందని రఘునాథ స్వామి తెలిపారు.

వంద శాతం లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో పోలియో చుక్కల పంపిణీని ముందుకు తీసుకు పోతున్నామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు గానూ జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు రోజుల పాటు, అలాగే, గ్రామీణ ప్రాంతంలో మూడు రోజుల పాటు ఈ ప్రక్రియను నిర్వహించనున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు.

జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 4,87,253 మంది:

మేడ్చల్ జిల్లాలో పోలియో చుక్కలు వేసేందుకు ఐదేళ్ల లోపు పిల్లలు 4,87,253 మంది ఉన్నారని గుర్తించామని ఆయన చెబుతూ, వీరందరికీ చుక్కలు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1, 093 బూతులను ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజు బూతుల వారీగా, ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి పిల్లలందరికీ చుక్కలు వేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు.

హై రిస్క్ ఏరియాలలో మొబైల్ వాన్స్ ఏర్పాటు:

జిల్లాలోని హై రిస్క్ ఏరియాలను కవర్ చేయడానికి మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని, వీరు మొబైల్ వాన్స్ ( 39 )లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు.

ఉప్పల్‌లో ప్రారంభం :

ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ నియోజక వర్గంలో ప్రారంభిస్తామని రఘునాథ స్వామి వెల్లడిస్తూ, స్థానిక ఎమ్మెల్యే తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే, మిగిలిన ప్రాంతాల్లో కూడా స్థానిక ప్రజా ప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. ప్రజల్లో అవేర్ నెస్ కల్పించేందుకే ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియను బూత్‌ల వారీగా ఎప్పటికప్పుడు వెబ్ పోర్టల్‌లో ఆన్లైన్‌లో అప్డేట్ చేస్తామన్నారు. పోలియో చుక్కలు వేసిన వారి చిటికెన వేలుకు మార్క్ వేస్తామని డీఎంహెచ్‌వో రఘునాథ స్వామి పేర్కొంటూ, మార్క్ లేని వారు ఎవరైనా కనపడితే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed