మాయ మాటలు చెప్పేటోళ్లు వస్తారు .. జాగ్రత్త : CM KCR

by Disha Web Desk 23 |   ( Updated:2023-10-18 14:37:37.0  )
మాయ మాటలు చెప్పేటోళ్లు వస్తారు .. జాగ్రత్త : CM KCR
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎంతో ప్రగతిని సాధించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం గుండ్ల పోచంపల్లి లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాయమాటలు చెప్పేటోళ్లు వస్తారని, ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇస్తారని, ఆపదమొక్కుల మొక్కి ఓట్లు అడుగుతారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిపాలన సంస్కరణలో భాగంగా మేడ్చల్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని ఇక్కడి ఓటర్లు చాలా చైతన్యవంతులుగా ఉంటారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చేస్తున్న పోరాటానికి కలిసి రాకపోగా అవహేళన చేసిన వారు ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. 58 సంవత్సరాల పాటు తెలంగాణలో భయంకరమైన దుస్థితి ఉండేదని రాష్ట్రం సాధించాక అన్ని రంగాలలో స్థిరమైన అభివృద్ధిని సాధించామని పేర్కొన్నారు. సాగునీరు తాగునీరు రంగంలో దేశానికే తలమానికంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.

మరో లక్ష డబుల్ బెడ్ రూములు

హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు మినీ భారత దేశాలుగా రోజురోజుకు విస్తరిస్తున్నాయని వీటి అభివృద్ధి కోసం ఈ దప గెలిచిన అనంతరం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తామని అన్నారు. నగరవాసులకు మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కడతామని హామీ ఇచ్చారు. ఒక మేడ్చల్ నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయల నిధులతో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని, మరింత అభివృద్ధి పనులు కోసం మంత్రి మల్లారెడ్డి కోరిన విధంగా నిధులు మంజూరు చేసేందుకు చూస్తామని తెలిపారు.

సాదాసీదాగా కేసీఆర్ ప్రసంగం

దాదాపుగా 15 నిమిషాల పాటు కొనసాగిన సీఎం కేసీఆర్ ప్రసంగం కేవలం సాధించిన ప్రగతి, గెలిస్తే చేయబోయే అభివృద్ధి విషయాలను ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో పడిన కష్టాలు, రాష్ట్రం ఏర్పాటు అనంతరం సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు తో పాటుగా పార్టీ మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ మాత్రమే ఆయన ప్రసంగం కొనసాగింది. కేవలం మాయమాటలు చెప్పే వాళ్ళు వస్తారు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అనే మాటలు తప్ప ఏ పార్టీని ఉద్దేశించి గాని ,ఏ నాయకుడిని ఉద్దేశించి గాని, విమర్శలు చేయలేదు. కుల మతాలు ప్రాంతీయ భావాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందని మాత్రమే చెప్పుకొచ్చారు.

మంత్రి మల్లారెడ్డి ప్రసంగం కూడా..

సీఎం కేసీఆర్ ప్రసంగానికి ముందు మంత్రి మల్లారెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలో సీఎం కేసీఆర్ ను పొగుడుతూనే సంక్షేమ పథకాల విషయాన్ని సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. దాదాపుగా ప్రసంగం మొత్తం చూసుకుంటూ చదువుతూనే మంత్రి ప్రసంగం కొనసాగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 కోట్ల రూపాయలు కేవలం మేడ్చల్ నియోజకవర్గం కూడా ఇక్కడి పథకాలను చూసి తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు రావాలని ఆశిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు 61 గ్రామపంచాయతీలు 41 ఎంపీటీసీలు 78 బ్యాంకు డైరెక్టర్లు అందరూ కూడా 95 శాతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని తెలిపారు. అందరూ కూడా సైనికులుగా పనిచేసే డిసెంబర్ మూడో తేదీ సీఎం కేసీఆర్ ని మూడవసారి సీఎం చేసేలా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు అంటూ..

సభలో ఒక మంత్రి మల్లారెడ్డి మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని స్కామ్ లేనని బీఆర్ఎస్ పార్టీలో అన్ని స్కీములు ఉంటాయని చలోక్తులు విసిరారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే ఎంపీ ఉన్నాడని గెలిచి నాలుగేళ్లు అయినప్పటికీ కనీసం ఆయన ముఖం చూపించలేదని, ఒక రూపాయి నిధులు కూడా నియోజకవర్గానికి ఇవ్వకుండా, పైసలు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకొని సీట్లు అమ్ముకుంటున్నాడని విమర్శించారు. ఆయన తమ గోటికి కూడా సరిపోడాని ఎద్దేవ చేశారు.

కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన రాగిడి..

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి ముందు రాగిడి లక్ష్మారెడ్డి ని సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటుగా పలువురు సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. మేడ్చల్ మల్కాజిగిరి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం మేయర్ లు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితరులు సభ వేదికపై ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed