రెండు దశల తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. టీయుఎస్

by Sumithra |
రెండు దశల తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. టీయుఎస్
X

దిశ, జవహర్ నగర్ : తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల సమితి (టీయుఎస్) ఉద్యమకారులు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బహుజన సత్త నాయకుడు, టీయుఎస్ నేత బండకింది సింగరాయ గౌడ్ అధ్యక్షతన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్ లోని ఎస్సీ దళిత సంక్షేమ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో 369 మంది, మలి దశలో సుమారు 1200 మంది అమరులైనారనని, ఇంకా 400 మంది ఆచూకి తెలియలేదని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను, కళాకారులను బాగా వాడుకొని, అతి ఘోరంగా వారిని త్రొక్కివేశారని వెల్లడించారు. 600 మంది ఉద్యమకారులకు కొన్ని సదుపాయాలు కల్పించి, మిగతా 600 మందిని గాలికి వదిలేశారని ఆరోపించారు. అందుకే ఉద్యమకారులు శ్రమించి బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి కీలకపాత్ర పోషించారని స్పష్టం చేశారు.

ఆర్థిక భారం పడకుండా పరిష్కరించే సమస్యలలో ఉద్యమకారులను, కళాకారులను గుర్తించి, వారికి తామ్రపత్రాలు అధికారికంగా అందజేయాలని అన్నారు. ఉద్యమకారుల బోర్డును విస్త్రృత ప్రాతిపదికన అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఉచిత బస్ పాసులు (భార్యాభర్తలకు) ఇవ్వాలని, ప్రభుత్వం ప్రకటించే పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని భర్తీల్లో 2% రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా ఆర్థిక భారం పడే సమస్యలలో ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలాల్లో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యమకారులకు ఇస్తున్న విధంగా రూ.30 వేల గౌరవ వేతనాన్ని, పెన్షన్గా ప్రతి నెల ఇవ్వాలని అన్నారు. అమరవీరుల స్మృతి వనం 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. ఉద్యమకారులకు ఆరోగ్య భీమా 20 లక్షల వరకు ఇవ్వాలని ఉద్యమకారులు ఏదైనా వ్యాపారం / వృత్తి చేసుకోవడానికి 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని తధితుర డిమాండ్లతో పాటు స్థానిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతలు ప్రతిపాదించిన కొన్ని ప్రజలకు సంబందించిన మౌలిక సమస్యలు, తప్పుడు కేసుల పై వెల్లడించిన న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్లను టీయూఎస్ నేత కళ్ళెపు చంద్రన్న ప్రకటించారు.

భవిష్యత్తులో వీటి సాధనకు సమిష్టిగా ఉద్యమించే క్రమంలో టీయుఎస్ కు సహకారం ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జి.యాదగిరి, మోత్కూరు మల్లేష్, ఉద్యమ కళాకారుల వేదిక డోలక్ యాదగిరి, ఏ.యాదగిరి తదితరులు ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల కృషి వెలకట్టలేనిదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారని, ఇది హర్షించదగిన విషయమేనని అన్నారు. కానీ ఇల్లు నిర్మించుకునే స్థితిలో ఏ ఉద్యమకారుడు లేడని, ఉద్యమంలో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీడీఎం చంద్రమౌళి, పీకెఎం జాన్, సీఎంఎస్ అల్లూరి సావిత్రి, టీవీఐవీ మబ్బుబాలు, ఐపీఓడబ్ల్యూ పి.సునీత, పెల్లూరి సీతక్క, జి.ఉపేంద్ర, అభ్యుదయ, కవి, కళాకారుడు ఎస్.కె.మీరా, ఇఫ్టూ శివబాబు, ఇఫ్టూ శ్రామిక స్పందన షేక్ షావలి, బీఎస్పీ యాకస్వామి, బీసీనేత వడ్డెర నర్సన్న, ఏ.ఆశయ్య, పాత్రికేయ మిత్రులు విష్ణు, కొన్నే వేణు తదితురులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed